కరోనా వేళ.. మరోసారి వణికిస్తోన్న ఎబోలా!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి కబళిస్తోన్న వేళ.. ప్రాణాంతక ఎబోలా మరోసారి విజృంభిస్తోంది. ముఖ్యంగా ఆఫ్రికాలోని పలు దేశాల్లో ఎబోలా కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది.

Published : 17 Feb 2021 01:22 IST

అప్రమత్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

జెనీవా: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి కబళిస్తోన్న వేళ.. ప్రాణాంతక ఎబోలా మరోసారి విజృంభిస్తోంది. ముఖ్యంగా ఆఫ్రికాలోని పలు దేశాల్లో ఎబోలా కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆఫ్రికాలోని ఆరు దేశాలను అప్రమత్తం చేసింది. ‘ఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే ఆరు దేశాలను అప్రమత్తం చేశాం. దీన్ని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని లైబీరియా, సయోర్రా లియోనె వంటి దేశాలకు సూచించాం. ప్రస్తుతం ఆయా దేశాలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి మార్గరెట్‌ హారిస్‌ పేర్కొన్నారు. కేవలం కాంగోలోనే ఇప్పటివరకు 300కేసులను గుర్తించగా, గినియాలో దాదాపు 109కేసులు నమోదైనట్లు వెల్లడించారు. వీటితో పాటు మరో రెండు దేశాల్లోనూ ఎబోలా కేసులు నమోదైనట్లు సమాచారం. అయితే, వీటి మూలాలను తెలుసుకునేందుకు ఇప్పటికే నమూనాలను విశ్లేషిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

ఆఫ్రికాలోని గినియా దేశంలో ఎబోలా వ్యాప్తి మొదలైనట్లు అక్కడి ప్రభుత్వం రెండు రోజుల క్రితం ప్రకటించింది. ఇక్కడ 2013-16 తర్వాత మరోసారి ఎబోలా వ్యాప్తి వెలుగుచూసింది. ఇక డెమొక్రాటిక్ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో ఫిబ్రవరి 7న ఎబోలా కేసులు‌ బయటపడినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే కరోనా వైరస్‌తో సతమతమవుతున్న ఆఫ్రికాలో ఎబోలా వెలుగు చూడడం కలవరపెట్టే విషయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉంటే, ఈ ప్రాణాంతక వ్యాధిని తొలిసారి 1976లో ఆఫ్రికాలో గుర్తించారు. ముఖ్యంగా 2013-16 మధ్యకాలంలో తీవ్ర ప్రభావం చూపిన ఈ వైరస్‌.. అప్పట్లో 28,646 మందిలో బయటపడింది. వీరిలో 11,323 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అనంతరం కాంగోలోనూ ఎబోలా విజృంభించింది. ఈ ప్రాణాంతక ఎబోలా వైరస్‌ వల్ల జ్వరం, కండరాల నొప్పి, విరేచనాలు, వాంతులు కావడంతో పాటు కాలేయం, మూత్రపిండాల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కొందరిలో శరీరం లోపల, బయట రక్తస్రావం జరుగుతుంది. ఎబోలా వల్ల దాదాపు 90శాతం ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని