Kiren Rijiju: ఈసీ స్వతంత్ర సంస్థ.. ప్రభుత్వం చెప్పినట్లు నడచుకోదు..!

కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థ అని.. ప్రభుత్వం చెప్పిన విధంగా నడుచుకోదని న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు పేర్కొన్నారు. అంతేకానీ, మనం చెప్పినట్లు ఈసీ వినాలని ప్రభుత్వం కోరుకోదని స్పష్టం చేశారు.

Published : 18 Nov 2022 01:48 IST

శ్రీనగర్‌: కేంద్ర ఎన్నికల సంఘం (EC) స్వతంత్ర సంస్థ అని.. ప్రభుత్వం చెప్పిన విధంగా నడుచుకోదని న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు పేర్కొన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు మాత్రమే ప్రభుత్వం అన్ని రకాల సహాయం చేస్తుందని.. అంతేకానీ, మనం చెప్పిన విధంగా నడుచుకోవాలని కోరుకోదని స్పష్టం చేశారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో పర్యటించిన ఆయన.. కేంద్ర ప్రభుత్వం, భాజపా మార్గదర్శకాల ప్రకారమే ఈసీ నడుచుకుంటోందని ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఇలా స్పందించారు.

‘పాలనాపరంగా కేంద్ర ఎన్నికల సంఘం న్యాయశాఖకు జవాబుదారి. ఎన్నికల సంఘం అనేది నిష్పక్షపాత, జవాబుదారీ కలిగిన స్వతంత్ర సంస్థ. ఎన్నికల సంఘం విషయంలో కేంద్రం పాత్ర చాలా పరిమితం. కేవలం ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను మాత్రమే ప్రభుత్వం చూసుకుంటుంది. ఎందుకంటే ప్రభుత్వ సహాయం లేకుండా న్యాయస్థానాలు లేదా ఇతర సంస్థలు కార్యకలాపాలు సాగించలేవు. వాటి కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అవసరమైన తోడ్పాటును మాత్రమే ఆ సంస్థలకు అందిస్తుంది. అంతేకానీ, ప్రభుత్వం చెప్పినట్లు వారిని ఆడించలేం’ అని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఉద్ఘాటించారు.

జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందించిన కిరణ్‌ రిజిజు.. 2020లో జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికలు విజయవంతంగా పూర్తైన విషయాన్ని గుర్తించాలని అన్నారు. ఇక్కడి అభివృద్ధిపైనే చర్చించాలని.. అసెంబ్లీ ఎన్నికలు సరైన సమయంలోనే జరగుతాయని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని