Gujarat Polls: రెండు దశల్లో గుజరాత్ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

గుజరాత్‌ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం నేడు విడుదల చేసింది.

Updated : 03 Nov 2022 17:55 IST

దిల్లీ: యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న గుజరాత్‌ అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగింది. ఈ రాష్ట్ర శాసనసభకు కేంద్ర ఎన్నికల సంఘం (EC) గురువారం షెడ్యూల్‌ ప్రకటించింది. రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు. డిసెంబరు 1న తొలి దశ పోలింగ్‌, డిసెంబరు 5న రెండో విడత ఓటింగ్‌ జరగనుంది.  హిమాచల్‌ ప్రదేశ్‌తో పాటే ఈ రాష్ట్రానికి కూడా డిసెంబరు 8నే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.

తొలి దశలో 89 స్థానాలకు, రెండో విడతలో 93 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్‌ జరగనుంది. ఎన్నికల్లో మొత్తం 4.9కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటింగ్‌ కోసం 51వేలకు పైగా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని సీఈసీ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. మోర్బీ విషాద ఘటన వల్లే షెడ్యూల్‌ విడుదల ఆలస్యమైందన్నారు.

గుజరాత్‌ శాసనసభ గడువు 2023 ఫిబ్రవరి 18తో ముగియనుంది. ఈ రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలుండగా.. 2017లో జరిగిన ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 99 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్‌ 77 స్థానాలు సాధించింది. ఆ తర్వాత రాష్ట్రంలో పలుమార్లు ఉప ఎన్నికలు జరిగి ప్రస్తుతం కాషాయ పార్టీ బలం 111కు పెరిగింది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి అధికారాన్ని నిలబెట్టుకోవాలని భాజపా గట్టిగా ప్రయత్నిస్తోంది. అటు పంజాబ్‌లో అఖండ విజయంతో జోరుమీదున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ.. గుజరాత్‌లో పోటీకి దిగుతోంది. ఇందుకోసం ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం సాగిస్తోంది. కాంగ్రెస్‌ కూడా వ్యూహాలు రచిస్తోంది. దీంతో రాష్ట్రంలో త్రిముఖ పోరు నెలకొంది.

ఇప్పటికే హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీకి ఈసీ షెడ్యూల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో నవంబరు 12న ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది. డిసెంబరు 8న కౌంటింగ్‌ చేపట్టనున్నారు. నిజానికి ఈ రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికల తేదీలను ప్రకటిస్తారని అంతా భావించారు. అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా హిమాచల్‌కు కాస్త ముందుగా షెడ్యూల్ విడుదల చేసినట్లు ఈసీ వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని