Gujarat: గుజరాత్ షెడ్యూల్‌ ఆలస్యంపై విమర్శలు.. ఈసీ వివరణ ఇదే

గుజరాత్‌ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనలో తాము 100 శాతం నిష్పక్షపాతంగా వ్యవహరించామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ విషయంపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలను ఖండించింది.

Updated : 03 Nov 2022 17:57 IST

దిల్లీ: గుజరాత్‌ ఎన్నికల ప్రకటనలో ఎలాంటి పక్షపాతం చూపించలేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఉద్దేశపూర్వకంగానే ఈ ఎన్నికల తేదీలను ఆలస్యంగా ప్రకటించారన్న ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. ఈ మేరకు షెడ్యూల్‌ ఆలస్యానికి గల కారణాలపై చీఫ్‌ ఎలక్షన్ కమిషనర్‌ (CEC) రాజీవ్‌ కుమార్‌ గురువారం వివరణ ఇచ్చారు.

‘‘గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన విషయంలో కొందరు కావాలనే ప్రతకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. గుజరాత్‌ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి 18వ తేదీతో ముగియనుంది. అందువల్ల ఎన్నికలు నిర్వహించేందుకు కావాల్సిన సమయం ఉంది. శాసనసభ గడువు ముగిసే తేదీకి.. ఎన్నికల కౌంటింగ్‌ తేదీకి మధ్య 72 రోజుల వ్యవధి ఉంది. షెడ్యూల్‌ ప్రకటనకు మేం చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వాతావరణం, గత అసెంబ్లీ ఎన్నికల తేదీలు.. ఇలా ఎన్నో అంశాలను బ్యాలెన్స్‌ చేసుకోవాలి. వాటన్నింటినీ పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నాం. గుజరాత్‌ ఎన్నికలకు నేటి నుంచి 38 రోజుల పాటు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండనుంది. ఇది తక్కువ సమయమే అయినప్పటికీ దిల్లీ ఎన్నికల సమయంలోనూ ఇలాగే ఉంది. షెడ్యూల్‌ ప్రకటన విషయంలో మేం 100శాతం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాం. అందుకు మేం గర్విస్తున్నాం’’ అని రాజీవ్‌ కుమార్‌ వివరణ ఇచ్చారు. అయితే, ఒకట్రెండు రోజులు ముందే షెడ్యూల్‌ ప్రకటించాలని నిర్ణయించినా.. మోర్బీ విషాద ఘటన కారణంగా కాస్త ఆలస్యమైందని ఆయన తెలిపారు. బుధవారం వరకు రాష్ట్రంలో సంతాప దినాలు ప్రకటించినందునే షెడ్యూల్‌ను నేడు విడుదల చేసినట్లు చెప్పారు.

సాధారణంగా రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలాలు ఆరు నెలల వ్యవధిలో ముగుస్తుంటే గనుక.. ఆ రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించి ఓట్ల కౌంటింగ్‌ కూడా ఒకే రోజున చేపడతారు. హిమాచల్‌ ప్రదేశ్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 8తో ముగుస్తుండగా.. గుజరాత్‌ శాసనసభ పదవీకాలం ఫిబ్రవరి 18తో పూర్తికానుంది. దీంతో ఈ రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటిస్తారని అంతా భావించారు. అయితే హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికలకు గత నెలలోనే తేదీలను ప్రకటించగా.. గుజరాత్‌ షెడ్యూల్‌ను కాస్త ఆలస్యం చేశారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే ఈ ఎన్నికల ప్రకటనను ఆలస్యం చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున విమర్శించాయి. వీటిపైనే ఈసీ నేడు స్పందించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని