Karnataka Polls: ఆ ఈవీఎంలన్నీ కొత్తవే.. ఎన్నికల సంఘం స్పష్టీకరణ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Elections) వినియోగించిన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషిన్లు (EVMs) ఇదివరకు దక్షిణాఫ్రికాలో ఉపయోగించినవి కావని కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) స్పష్టం చేసింది.

Published : 12 May 2023 00:22 IST

దిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Elections) వినియోగించిన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషిన్లు (EVMs) ఇదివరకు దక్షిణాఫ్రికాలో ఉపయోగించినవని కాంగ్రెస్‌ పార్టీ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) తోసిపుచ్చింది. ఇటువంటి అసత్య ప్రచార వ్యాప్తికి కారణమైన ఆ సమాచారం మూలాలను బయటపెట్టాలని కాంగ్రెస్‌ పార్టీకి సూచించింది. కర్ణాటకలో మే 10న వినియోగించిన ఈవీఎంలు ఈసీఐఎల్‌ నూతనంగా తయారు చేసినవేనని పేర్కొంటూ కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలాకు లేఖ రాసింది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగిస్తున్న ఈవీఎంలు గతంలో దక్షిణాఫ్రికాలో ఉపయోగించినవని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి మే 8న కాంగ్రెస్‌ పార్టీ లేఖ రాసింది. అవి కూడా రీ-వ్యాలిడేషన్‌, రీ-వెరిఫికేషన్‌ లేకుండానే వాటిని పునర్వినియోగం చేశారని అనుమానం వ్యక్తం చేసింది. తాజాగా దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం.. ఈవీఎంలు దక్షిణాఫ్రికాకు పంపించినవి కావని అసలు ఆ దేశంలో ఎక్కడా వినియోగించినవి కావని స్పష్టం చేసింది.

ఈసీఐఎల్‌ నూతనంగా తయారు చేసిన ఈవీఎంలనే విషయం కాంగ్రెస్‌ పార్టీకి కూడా స్పష్టంగా తెలుసని ఈసీ ఉద్ఘాటించింది. కర్ణాటక ఎన్నికలకు ఈవీఎంలు తరలించే ప్రతిస్థాయిలోనూ కాంగ్రెస్‌ ప్రతినిధి పాల్గొన్నారని తెలిపింది. అటువంటి తప్పుడు సమాచారం వ్యాప్తి మూలాలను మరోసారి నిర్ధారించుకోవాలని కాంగ్రెస్‌ పార్టీని కోరింది. అంతేకాకుండా దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారో మే 15 సాయంత్రం 5గంటల్లోగా తెలియజేయాలని ఎన్నికల సంఘం అభ్యర్థించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు