ECI: మరో సమరానికి ఈసీఐ కసరత్తు.. జమ్మూకశ్మీర్‌ సహా 3 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు

మరో ఎన్నికల సమరానికి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. జమ్మూకశ్మీర్‌తోపాటు హరియాణా, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో ఆగస్టు 20 నాటికి తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది.

Published : 21 Jun 2024 16:16 IST

దిల్లీ: జమ్మూకశ్మీర్‌తో పాటు (jammu Kashmir) హరియాణా (Haryana), ఝార్ఖండ్‌ (Jharkhand), మహారాష్ట్ర(Maharashtra) శాసనసభ ఎన్నికల (Assembly Elections) నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు మొదలుపెట్టింది. ఆగస్టు 20 నాటికి ఓటర్ల సవరణ ప్రక్రియ పూర్తి చేసి తుది జాబితాను ప్రకటించాలని నిర్ణయించింది. ఈమేరకు ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత ప్రధాన ఎన్నికల అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు వీలుగా అవసరమైనచోట కొత్తగా పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ జూన్‌ 25 నుంచి ప్రారంభమవుతుందని ఈసీ వెల్లడించింది. జులై 1 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించనున్నట్లు స్పష్టం చేసింది. జులై 25న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటిస్తామని, ఆగస్టు 9 వరకు అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 20న తుది జాబితా విడుదల చేస్తామని పేర్కొంది.

2018లో జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ రద్దయిన తర్వాత నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ జరిగింది. ఆ తర్వాత అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జమ్మూకశ్మీర్‌ ఓటర్ల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ క్రమంలో ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని విస్త్రృతం చేయాలని ఈసీ నిర్ణయించింది. అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అక్కడి అధికారులను ఆదేశించింది. మరోవైపు హరియాణా అసెంబ్లీ గడువు నవంబర్‌ 11తో ముగుస్తుండగా.. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబర్‌ 26, ఝార్ఖండ్‌ అసెంబ్లీ గడువు జనవరి 5, 2025తో ముగియనుంది. ఈనేపథ్యంలో వీటన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. మరోవైపు ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల ఉన్నతాధికారులతో ఈసీఐ వారం రోజుల్లో సమావేశం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని