Arpita Mukherjee: అర్పితా ముఖర్జీ ఇంట్లో నల్ల డైరీ.. అందులో ఏముందో?

పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకున్న పాఠశాల ఉపాధ్యాయ, సిబ్బంది నియామక కుంభకోణం కేసులో తవ్వే కొద్ది కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు

Published : 26 Jul 2022 18:26 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకున్న పాఠశాల ఉపాధ్యాయ, సిబ్బంది నియామక కుంభకోణం కేసులో తవ్వే కొద్ది కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇటీవల రాష్ట్ర మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలు, సినీ అర్పితా ముఖర్జీ ఇంట్లో నోట్ల గుట్టలు బయటపడిన విషయం తెలిసిందే. దీంతో మంత్రి పార్థా, అర్పితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ అధికారులు అరెస్టు చేశారు. అయితే తనిఖీల్లో నటి ఇంట్లో ఓ నల్ల డైరీని ఈడీ అధికారులు గుర్తించారు. అందులో కుంభకోణానికి సంబంధించిన కీలక రహస్యాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ డైరీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలోని ఉన్నత విద్య, పాఠశాల విద్య విభాగానికి చెందినదిగా గుర్తించారు. అందులోని 40 పేజీల్లో చాలా విషయాలు రాసి ఉన్నాయని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ వివరాలు టీచర్‌ నియామక కుంభకోణంలోని రహస్యాలను బట్టబయలు చేసే అవకాశముందని తెలిపాయి. ఈ డైరీ అర్పిత ఇంట్లో ఎందుకు ఉంది అనే దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

పార్థా ఛటర్జీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా కొనసాగిన 2014-2021 మధ్య కాలంలో ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు గత శుక్రవారం అర్పిత ఇంట్లో సోదాలు చేపట్టగా.. రూ.21కోట్ల నగదు బయటపడింది. దీంతో మంత్రి పార్థా ఛటర్జీని 26 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు గత శనివారం అరెస్టు చేశారు. ఆ తర్వాత అర్పితను కూడా అదుపులోకి తీసుకున్నారు.

అయితే తనకు ఆరోగ్యం సరిగా లేదని మంత్రి చెప్పడంతో ఆయనను భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ పార్థాను పరీక్షించిన వైద్యులు ఛటర్జీ ఆరోగ్యం ఆసుపత్రిలో చేర్చాల్సినంతగా ఆందోళనకరంగా లేదని తెలిపారు. ఈ విషయాన్ని దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది. దీంతో పార్థా, అర్పితను మరో పది రోజుల పాటు (ఆగస్టు 3వ తేదీ వరకు) కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు