ED: అనిల్‌ దేశ్‌ముఖ్‌కు మూడోసారి సమన్లు

ఎన్సీపీ సీనియర్‌ నేత, మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు మూడోసారి సమన్లు జారీ చేశారు. మనీలాండరింగ్‌ వ్యవహారంలో

Updated : 03 Jul 2021 13:50 IST

ముంబయి: ఎన్సీపీ సీనియర్‌ నేత, మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు మూడోసారి సమన్లు జారీ చేశారు. మనీలాండరింగ్‌ వ్యవహారంలో ఆయనపై ఈడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా ఆయనను ప్రశ్నించేందుకు గతవారం అధికారులు రెండుసార్లు సమన్లు జారీ చేశారు. అయితే కొవిడ్‌ దృష్ట్యా తాను వ్యక్తిగతంగా హాజరుకాలేనని, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వాంగ్మూలం ఇస్తానని దేశ్‌ముఖ్‌ కోరారు. ఇందుకు అంగీకరించని దర్యాప్తు సంస్థ నేడు మరోసారి సమన్లు జారీ చేసింది. జులై 5న దక్షిణ ముంబయిలోని ఈడీ కార్యాలయానికి రావాలని ఆదేశించింది.

బార్‌ యజమానుల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని దేశ్‌ముఖ్‌ పోలీసులకు లక్ష్యంగా పెట్టారని ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ ఏప్రిల్‌లో ఆరోపణలు చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు లేఖ కూడా రాశారు. ఈ పరిణామాల నేపథ్యంలో దేశ్‌ముఖ్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. పరమ్‌బీర్‌ ఆరోపణలపై దర్యాప్తు చేయాలని ఇటీవల బాంబే హైకోర్టు... సీబీఐని ఆదేశించింది. దీంతో మాజీ మంత్రిపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసింది. దీని ఆధారంగా ఈడీ.. దేశ్‌ముఖ్‌పై అక్రమ నగదు చలామణి చట్టం (పీఎంఎల్‌ఏ) కింద క్రిమినల్‌ కేసు నమోదు చేసింది. ఇటీవల ముంబయిలోని ఆయన ఇల్లు, కార్యాలయాలతో పాటు.. నాగ్‌పుర్‌లోని దేశ్‌ముఖ్‌ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. దేశ్‌ముఖ్‌ వ్యక్తిగత కార్యదర్శి, వ్యక్తిగత సిబ్బందిని అరెస్టు చేసి ప్రశ్నించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని