Sonia Gandhi: అవన్నీ మోతిలాల్‌ వోరాకే తెలుసు.. ఈడీ ప్రశ్నలకు సోనియా సమాధానం

నేషనల్ హెరాల్డ్‌ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈడీ విచారణ బుధవారంతో ముగిసే అవకాశముంది. ఈ కేసులో సోనియాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌

Published : 27 Jul 2022 10:51 IST

దిల్లీ: నేషనల్ హెరాల్డ్‌ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈడీ విచారణ బుధవారంతో ముగిసే అవకాశముంది. ఈ కేసులో సోనియాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు రెండుసార్లు విచారించిన విషయం తెలిసిందే. మంగళవారం దాదాపు ఆరు గంటల పాటు ఈడీ ఆమెను ప్రశ్నించింది. అయితే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన సోనియా.. కొన్ని తనకు తెలియవని చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

నేషనల్‌ హెరాల్డ్‌ పబ్లిషర్‌ అయిన అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌) టేకోవర్‌కు సంబంధించిన లావాదేవీల గురించి సోనియాను ప్రశ్నించగా.. అవన్నీ మోతీలాల్‌ వోరాకే తెలుసని ఆమె చెప్పినట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్‌, ఏజేఎల్‌, యంగ్‌ ఇండియన్‌ మధ్యలో జరిగిన ఆర్థిక లావాదేవీలన్నీ ఆయనే చూసుకున్నారని ఆమె చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అయిన మోతీలాల్‌ వోరా.. మధ్యప్రదేశ్‌ సీఎంగా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా, ఆలిండియా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా అనేక బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ కోశాధికారిగానూ వ్యవహరించారు. 2020 డిసెంబరులో ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు.

ఇదీ చదవండి..: నేషనల్‌ హెరాల్డ్‌... ఇదీ అసలు వివాదం!

దిల్లీలో భద్రత కట్టుదిట్టం..

ఈ కేసులో సోనియా గాంధీని బుధవారం కూడా ఈడీ ప్రశ్నించనుంది. నేటితో ఆమె విచారణ ముగిసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే మంగళవారం నాటి ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని నేడు దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యాయలం ఎదుట భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు ఈడీ విచారణకు నిరసనగా కాంగ్రెస్‌ శ్రేణులు నేడు ‘సత్యాగ్రహ’ పేరుతో ఆందోళనకు దిగారు.

అప్పుడు భాజపా ఆందోళనలు చేయలేదా..

కాంగ్రెస్‌ ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న ఆరోపణలను హస్తం పార్టీ సీనియర్‌ నేత పి. చిదంబరం తిప్పికొట్టారు. తమ నాయకురాలిని విచారణ పేరుతో వేధిస్తుంటే ఆందోళన చేసే హక్కు తమకు ఉందని అన్నారు. ‘‘కాంగ్రెస్ ఎందుకు వీధుల్లోకి దిగి నిరసనలు చేస్తోందని భాజపా అడుగుతోంది. గతంలో మోదీని దర్యాప్తు సంస్థలు విచారించినప్పుడు.. భాజపా గుజరాత్‌ అంతా పోస్టర్లు పెట్టి ఆందోళనలు చేపట్టింది. ఇప్పుడు సోనియా గాంధీని ఈడీ విచారిస్తోంది. మా నాయకురాలిని వేధింపులకు గురిచేస్తుంటే ఆందోళన చేసే హక్కు మాకుంది’’ అని చిదంబరం ట్వీట్ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని