Hemant Soren: హేమంత్‌ సోరెన్‌కు బెయిల్‌పై.. ‘సుప్రీం’కు ఈడీ

హేమంత్‌ సోరెన్‌కు ఝార్ఖండ్‌ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సవాలు చేస్తూ ‘ఈడీ’ సోమవారం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

Published : 08 Jul 2024 23:16 IST

రాంచీ: భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఐదు నెలలపాటు జైలులో ఉన్న జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌ (Hemant Soren) ఇటీవల విడుదలై మరోసారి ఝార్ఖండ్‌ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఝార్ఖండ్‌ హైకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే.. ఈ బెయిల్‌ను సవాలు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) సోమవారం సుప్రీం కోర్టు (Supreme Court)ను ఆశ్రయించింది. అసెంబ్లీలో నిర్వహించిన బల పరీక్షలో హేమంత్ సోరెన్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం విజయం సాధించిన వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది.

బల పరీక్షలో నెగ్గిన హేమంత్‌ సోరెన్

భూకుంభకోణం కేసులో జనవరి 31న ఈడీ అధికారులు హేమంత్‌ను అరెస్టు చేశారు. ఈ పరిణామానికి ముందే ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో ఫిబ్రవరి 2న చంపయీ సోరెన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గత నెల 28న హేమంత్‌కు రాష్ట్ర హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో అదే రోజు జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం చంపయీ రాజీనామా చేయడంతో, హేమంత్‌ మూడోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం అసెంబ్లీలో విశ్వాస తీర్మానం నెగ్గారు. 81 మంది చట్టసభ్యులకు గానూ 45 మంది ఆయనకు అనుకూలంగా ఓటేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని