Arpitha: నిన్న అర్పితను విచారించాం.. అందుకే పార్థా వద్దకు వచ్చాం: ఈడీ

బెంగాల్‌లో పాఠశాల ఉద్యోగాల నియామకం కుంభకోణం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి పార్థా ఛటర్జీని ఈడీ అధికారులు.....

Published : 17 Aug 2022 17:37 IST

కోల్‌కతా: బెంగాల్‌లో పాఠశాల ఉద్యోగాల నియామకం కుంభకోణం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి పార్థా ఛటర్జీని ఈడీ అధికారులు మరోసారి విచారించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఈడీ బృందం కోల్‌కతాలోని ఆయన శిక్ష అనుభవిస్తున్న జైలుకు వెళ్లింది. ఈ కుంభకోణం కేసులో ఇప్పటికే పలుమార్లు పార్థా ఛటర్జీ, ఆయన సన్నిహితురాలైన సినీనటి అర్పితా ముఖర్జీని విచారించిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం అర్పితను విచారించిన ఈడీ అధికారులు.. ఆమె ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా మరోసారి పార్థా ఛటర్జీని  ప్రశ్నించేందుకు ప్రెసిడెన్సీ కరక్షనల్‌ హోమ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఈడీ అధికారులు మాట్లాడుతూ.. ‘‘అర్పితా ముఖర్జీని నిన్న ప్రశ్నించాం. ఆమె ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా ఈరోజు పార్థా ఛటర్జీని విచారిస్తున్నాం’’ అని వెల్లడించారు. 

పాఠశాల ఉద్యోగుల నియామకం కుంభకోణంలో అరెస్టయిన పార్థా ఛటర్జీ తన మంత్రి పదవితో పాటు తృణమూల్‌ కాంగ్రెస్‌లో అన్ని హోదాల నుంచి ఉద్వాసనకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో పార్థా ఛటర్జీతో పాటు మరో ఇద్దరిని ఈడీ అదుపులోకి తీసుకుంది. వీరిలో ఛటర్జీ సన్నిహితురాలు, సినీనటి అర్పితా ముఖర్జీ, ఆయన వ్యక్తిగత కార్యదర్శి సుకాంతా ఆచార్య ఉన్నారు. పార్థా ఛటర్జీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా కొనసాగిన 2014-2021 మధ్య కాలంలో ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి అర్పితా ముఖర్జీ నివాసంలో ఈడీ జరిపిన సోదాల్లో రూ.కోట్లలో నోట్ల కట్టలు, బంగారం, కీలక దస్త్రాలు బయటపడటం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని