Nawab Malik: దావూద్‌తో సంబంధమున్న కేసు.. మహా మంత్రిని ప్రశ్నిస్తోన్న ఈడీ

అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకు సంబంధించిన ఓ మనీలాండరింగ్‌ కేసులో.. మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ను నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు

Published : 23 Feb 2022 13:30 IST

ముంబయి: అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకు సంబంధించిన ఓ మనీలాండరింగ్‌ కేసులో.. మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ను నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఉదయం 6 గంటల ప్రాంతంలో ఎన్సీపీ నేత నవాబ్‌ ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు గంట పాటు ఆయన్ను విచారించారు. అనంతరం తమతో పాటే ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడ ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాలను నవాబ్‌ మాలిక్‌ కార్యాలయం ట్విటర్‌లో ధ్రువీకరించింది. 

కేంద్ర దర్యాప్తు సంస్థల వినియోగంపై మహారాష్ట్ర మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వం, కేంద్రం మధ్య గత కొన్ని రోజులుగా మాటల యుద్ధం జరుగుతోన్న వేళ.. ఈ పరిణామాలు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. నవాబ్‌ మాలిక్‌ నోరు నొక్కేందుకు కేంద్రం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఎన్సీపీ, శివసేన నేతలు దుయ్యబట్టారు. అయితే, కొన్ని ఆస్తులకు సంబంధించిన కేసులో మాలిక్‌ను విచారించాల్సిన అవసరం ఉందని, అందుకే ఆయనను ప్రశ్నిస్తున్నామని ఈడీ వెల్లడించింది. 

‘‘రాజకీయ దురుద్దేశంతోనే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఇలా ఉపయోగిస్తున్నారు. నవాబ్‌ మాలిక్‌ నిజాలను బయటపెడుతున్నారు. భాజపాకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై సీబీఐ, ఈడీలను ప్రయోగిస్తున్నారు. పాత విషయాలను తిరగతోడుతున్నారు. కానీ గుర్తుంచుకోండి.. 2024 తర్వాత మీరు కూడా విచారణలు ఎదుర్కోవాల్సిందే’’ అని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ మండిపడ్డారు.

అటు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ కూడా దీనిపై స్పందించారు. ‘‘నవాబ్‌ మాలికపై ఇలాంటి దాడులు జరుగుతాయని మాకు ముందే తెలుసు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దావూద్‌ పేరు అడ్డంపెట్టి నన్ను కూడా ఇలాగే టార్గెట్ చేశారు. ఇప్పుడు 25ఏళ్ల తర్వాత కూడా అదే ట్రిక్‌ ప్లే చేస్తున్నారు’’ అని దుయ్యబట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని