Rahul Gandhi: మరోసారి ఈడీ ముందుకు రాహుల్‌ గాంధీ

నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేడు మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ ఉదయం 11.05 గంటల ప్రాంతంలో

Published : 20 Jun 2022 12:40 IST

దిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేడు మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ ఉదయం 11.05 గంటల ప్రాంతంలో రాహుల్‌ తన జడ్‌ ప్లస్‌ కేటగిరీ సీఆర్పీఎఫ్‌ భద్రత కాన్వాయ్‌తో ఈడీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. న్యాయపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత రాహుల్‌ను అధికారులు ప్రశ్నిస్తున్నారు.

ఈ కేసులో గతవారం మూడు రోజుల పాటు రాహుల్‌ను ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. తదుపరి విచారణ నిమిత్తం గత శుక్రవారమే హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. అయితే రాహుల్‌ తల్లి, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అనారోగ్యం దృష్ట్యా విచారణ వాయిదా వేయాలని ఆయన ఈడీని అభ్యర్థించారు. దీంతో సోమవారం రావాలని ఈడీ సమన్లు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే రాహుల్‌ నేడు నాలుగో సారి దర్యాప్తు సంస్థ ముందు హాజరయ్యారు.

అయితే, గతవారం జరిగిన ఉద్రిక్త ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈడీ కార్యాలయం చుట్టూ 144 సెక్షన్‌ విధించారు. అయినప్పటికీ కాంగ్రెస్‌ కార్యకర్తలు పెద్ద ఎత్తున దర్యాప్తు సంస్థ ఆఫీసుకు చేరుకున్నారు. దీంతో భారీగా పోలీసు, పారామిలిటరీ బలగాలను మోహరించారు.

జంతర్‌మంతర్‌ వద్ద కాంగ్రెస్‌ సత్యాగ్రహ దీక్ష

మరోవైపు, రాహుల్‌పై ఈడీ విచారణతో పాటు అగ్నిపథ్‌ పథకాన్ని  నిరసిస్తూ కాంగ్రెస్‌ శ్రేణులు నేడు దేశవ్యాప్తంగా మరోసారి ఆందోళనకు దిగాయి. దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మల్లికార్జున్‌ ఖర్గే, సల్మాన్‌ ఖుర్షీద్‌, నారాయణ స్వామి తదితరులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో పాల్గొనేందుకు పెద్దసంఖ్యలో కాంగ్రెస్‌ కార్యకర్తలు చేరుకున్నారు. అయితే పోలీసులు వారిని అడ్డుకోవడంతో కార్యకర్తలు వారితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఒకింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని