Tihar Jail: సెల్‌ నంబర్‌ 1లో సిసోదియా.. 5గంటలపాటు ప్రశ్నించిన ఈడీ

మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఆప్‌ నేత మనీశ్‌ సిసోదియాను (Manish Sisodia) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రశ్నించింది. తిహాడ్‌ జైల్లో (Tihar Jail) ఉన్న ఆయన్ను మూడు రోజులు ఈడీ (ED)  విచారించేందుకు న్యాయస్థానం అనుమతి తీసుకుంది.

Published : 07 Mar 2023 21:44 IST

దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా (Manish Sisodia) ప్రస్తుతం జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు. తిహాడ్‌ జైల్లో (Tihar Jail) ఉన్న ఆయన్ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) మంగళవారం విచారించింది. మనీ లాండరింగ్‌కు (money laundering) సంబంధించి సుమారు ఐదు గంటలపాటు సిసోదియాను ప్రశ్నించిన ఈడీ అధికారులు ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. అయితే, మరో రెండు రోజులు (మార్చి 8, 9 తేదీల్లోనూ) అధికారులు ఆయనను జైల్లోనే ప్రశ్నించనున్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.

సెల్‌ నంబర్‌ 1లో..

దిల్లీ మద్యం విధానంలో వచ్చిన అవినీతి ఆరోపణలపై మనీశ్‌ సిసోదియాను సీబీఐ అధికారులు ఫిబ్రవరి 26న అరెస్టు చేశారు. అనంతరం ఐదు రోజుల పాటు సీబీఐ తన కస్టడీలోకి తీసుకొని విచారించింది. అనంతరం ప్రత్యేక న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టగా.. 14 రోజులు జ్యుడిషియల్‌ రిమాండు విధించింది. దీంతో మార్చి 20వరకు సిసోదియా తిహాడ్‌ జైల్లోనే ఉండనున్నారు. జైల్లో ఆయనకు సెల్‌ నంబర్‌ 1ను కేటాయించారు. సెల్‌లోకి తరలించే ముందు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించామని అధికారులు వెల్లడించారు.

జైల్లో సిసోదియాను సీనియర్‌ సిటిజన్లకు ఇచ్చే సింగిల్‌ సెల్‌ను కేటాయించారు. బ్లాంకెట్లు, సబ్బులు.. రాత్రి ఆహారంలో అన్నం, చపాతీలు అందించినట్లు జైలు అధికారులు వెల్లడించారు. జైలు మాన్యువల్‌ ప్రకారం, సాధారణ ఖైదీలకు అందించే ఆహారమే ఆయనకూ అందిస్తున్నామని జైలు అధికారులు వెల్లడించారు. అయితే, జైలు లోపలికి భగవద్గీత, కళ్లజోడు, ఔషధాలు తీసుకెళ్లేందుకు న్యాయస్థానం అనుమతించింది. విపాసన ధ్యానం (Vipassana Meditation) చేసుకునేందుకు అనుమతించాలని సిసోదియా చేసిన సూచనను పరిశీలించాలని తిహాడ్‌ జైలు అధికారులకు న్యాయస్థానం సూచించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు