West Bengal: ఇంట్లో నోట్ల గుట్టల ఘటన.. బెంగాల్ మంత్రి అరెస్టు

ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో పశ్చిమ్ బెంగాల్‌ మంత్రి పార్థా ఛటర్జీని శనివారం ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌(ED) అరెస్టు చేసింది.

Published : 23 Jul 2022 11:47 IST

ఈడీ అదుపులోకి మంత్రి సన్నిహితురాలు

కోల్‌కతా: ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో పశ్చిమ్ బెంగాల్‌ మంత్రి పార్థా ఛటర్జీని శనివారం ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ED) అరెస్టు చేసింది. దీనికి ముందు కోల్‌కతాలోని మంత్రి నివాసంలో అధికారులు 23 గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. అయితే విచారణ సమయంలో ఆయన సహకరించలేదని, దాంతో ఆయన్ను అరెస్టు చేశామని ఈడీ వెల్లడించింది. మంత్రి అనుచరురాలు అర్పితా ముఖర్జీ నివాసంలో శుక్రవారం రూ.20 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ అరెస్టు చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆమెను కూడా ఈడీ అదుపులోకి తీసుకుంది.

పార్థా ఛటర్జీ విద్యా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం ఈడీ అధికారులు మంత్రి, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ, విద్యా మంత్రి ప్రకాశ్‌ అధికారి, ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రాథమిక విద్యామండలి మాజీ అధ్యక్షుడు మాణిక్‌ భట్టాచార్య, మరికొందరి నివాసాలపైనా ఏకకాలంలో దాడులు నిర్వహించారు. పార్థా ఛటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద ఓఎస్‌డీగా పనిచేసిన పి.కె.బందోపాధ్యాయ్‌, వ్యక్తిగత కార్యదర్శి సుకాంతా ఆచార్జీ తదితరుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. అర్పితా ఇంట్లో రూ.20 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ మొత్తం ఉపాధ్యాయ నియామక కుంభకోణానికి సంబంధించిందేనని భావిస్తున్నట్లు ఈడీ ఒక ప్రకటనలో పేర్కొంది. శనివారం కూడా అర్పిత నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. పలు ఆస్తులకు సంబంధించిన దస్త్రాలు, రూ.50 లక్షల విలువైన బంగారు, వజ్ర ఆభరణాలు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయి. 

ఇది ట్రైలర్ మాత్రమే..: భాజపా

ఈడీ దాడుల నేపథ్యంలో భాజపా రెండు ఫొటోలు షేర్‌ చేసి, తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆ ఫొటోల్లో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మంత్రి ఛటర్జీతో అర్పిత దర్శనమిచ్చారు. ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు చిత్రం ముందుందంటూ భాజపా నేత సువేందు అధికారి ఈ చిత్రాలను పోస్టు చేశారు. ఇదిలా ఉండగా.. అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కోల్‌కతాలో టీఎంసీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఆ మరుసటి రోజే ఈడీ దాడులు చేయడం వెనుక తమ నాయకులను వేధించాలన్నదే ఈడీ వ్యూహంగా ఉందని తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని