congress: దేశంలో విద్యావ్యవస్థ నాశనం అయ్యింది: కాంగ్రెస్‌

నీట్‌ యూజీ, యూజీసీ నెట్‌ ప్రశ్నపత్రాల లీకేజీతో జరుగుతున్న వివాదాల నేపథ్యంలో ఆదివారం జరగాల్సిన నీట్‌ పీజీ ప్రవేశ పరీక్షను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. దీనిపై కాంగ్రెస్‌ మండిపడింది. 

Updated : 23 Jun 2024 12:15 IST

దిల్లీ: నీట్‌ యూజీ, యూజీసీ నెట్‌ ప్రశ్నపత్రాల లీకేజీతో ముసురుకున్న వివాదాల నేపథ్యంలో ఆదివారం జరగాల్సిన నీట్‌ పీజీ ప్రవేశ పరీక్షను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌(Congress) అధ్యక్షుడు మల్లికిర్జున ఖర్గే(Mallikarjun Kharge) కేంద్రంపై విమర్శలు గుప్పించారు. సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు.

‘‘నీట్‌లో జరిగిన అక్రమాలకు అధికారులను మార్చడం విద్యా వ్యవస్థలోని సమస్యకు పరిష్కారం కాదు. ఎన్‌టీఏ స్వయం ప్రతిపత్తి గల సంస్థ. కానీ.. ప్రస్తుతం అది భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలకు అనుగుణంగా వ్యవహరిస్తోంది. విద్యార్థులకు న్యాయం జరిగేలా చూసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఇప్పుడు నీట్‌ పరీక్ష వాయిదా పడింది. ఈ పది రోజుల్లో దాదాపు 4 పరీక్షలను వాయిదా వేయడమో, రద్దు చేయడమో చేశారు. పేపర్‌ లీకేజీలు, అవినీతి, అవకతవకలు మన విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నాయి. దీని వల్ల నీట్‌ అభ్యర్థుల భవిష్యత్తు చిన్నాభిన్నం అవుతోంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రధాని మోదీ(PM Modi) హయాంలో దేశంలో విద్యావ్యవస్థ ధ్వంసమైందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మండిపడ్డారు. భాజపా పాలనలో విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టకుండా ప్రభుత్వంపై పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అసహనం వ్యక్తం చేశారు. పేపర్ లీక్ రాకెట్, విద్యాశాఖలో జరుగుతున్న అవినీతిపై చర్యలు తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం నిస్సహాయంగా ఉందన్నారు. అసమర్థ మోదీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుకు పెను ప్రమాదమని, దేశ భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం ఉందని రాహుల్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

నీట్‌ పరీక్షను తొలుత మార్చి 3న నిర్వహించాల్సి ఉండగా.. ఆ తర్వాత జూలై 7న నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అనంతరం జూన్ 23కి అంటే ఈరోజుకి సవరించారు. అయితే.. కొన్ని గంటల ముందు శనివారం రాత్రి 10 గంటలకు కేంద్ర ఆరోగ్యశాఖ స్పందిస్తూ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) డైరెక్టర్‌ జనరల్‌ సుబోధ్‌ సింగ్‌కు ఉద్వాసన పలికింది. నీట్‌ యూజీలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. ముందు జాగ్రత్త చర్యగా నీట్‌ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నామని శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అతి త్వరలో పరీక్ష తేదీని ప్రకటిస్తామని తెలిపింది. వాయిదావల్ల విద్యార్థులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని