
Education: సిలబస్ తగ్గించడం కాదు.. సంస్కరణలు చేపట్టాలి!
కరోనా నేపథ్యంలో విద్యావిధానంపై విద్యావేత్తల అభిప్రాయం
ఇంటర్నెట్ డెస్క్: కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా విద్యావిధానంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. విద్యార్థుల కెరీర్‌ను దృష్టిలో పెట్టుకొని సిలబస్‌ను తగ్గించాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎస్సీఈఆర్టీ) భావిస్తోంది. అయితే, ఇది ఏ మాత్రం సరైన నిర్ణయం కాదని.. సిలబస్ తగ్గించడంపై కాకుండా విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.
సిలబస్ తగ్గించడం కన్నా.. విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను గుర్తించడమే చాలా ముఖ్యం. విద్యార్థుల్లో నేర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించి.. వారి విద్యా ప్రయాణాన్ని అర్థవంతంగా కొనసాగించడంపై దృష్టి సారించాల్సిన అవసరముందని విద్యావేత్త డాక్టర్ శ్రీధర్ వెల్లడించారు.
సిలబస్ తగ్గించడం వల్ల ప్రాథమిక, ఉన్నత విద్యపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా నీట్, జేఈఈ పరీక్షలు రాసేవారికి ఎన్సీఈఆర్టీ పూర్తి సిలబస్ చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు వారంతా తగ్గించిన సిలబస్‌ను చదివితే గందరగోళానికి గురయ్యే అవకాశముందని బెంగళూరుకి చెందిన ఓ పాఠశాల ప్రిన్సిపల్ డబ్ల్యూఆర్ డేవిడ్ తెలిపారు. విద్యార్థులు వారి పాఠ్యపుస్తకాల కన్నా బాహ్యప్రపంచం నుంచే ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సి ఉందని, సిలబస్ తగ్గింపుతో విద్యార్థులకు ఎలాంటి ఉపయోగం లేదని ఘజియాబాద్‌కు చెందిన టీచర్ రచన రాయ్ తెలిపారు. ఈ కాలం విద్యార్థులు జ్ఞానం పెంచుకోవడానికి పాఠ్యపుస్తకాలపై ఆధరపడట్లేదని, సమాచారం కోసం ఇంటర్నెట్ ఇతర మార్గాలను ఆశ్రయిస్తున్నారని చెప్పారు.
సిలబస్‌ను ఒక్కసారి తగ్గించి సమస్యకు తాత్కాలిక పరిష్కారం చూపే కన్నా విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని మరికొందరు విద్యావేత్తలు కోరుతున్నారు. విద్యావ్యవస్థను మరింత మెరుగుపర్చే విధంగా కొత్త బోధన పద్ధతులను అమలు చేయాలంటున్నారు.