Netaji: నేతాజీకి సంబంధించిన దస్త్రాలు పొందేందుకు ప్రయత్నించాం: కేంద్రం

స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌కు సంబంధించి వివిధ దేశాల్లో ఉన్న రికార్డులు, దస్త్రాలను భారత్‌కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసినట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్‌ రాజ్యసభలో వెల్లడించారు. ఈ మేరకు పలు దేశాల ప్రభుత్వాలకు

Published : 11 Feb 2022 01:36 IST

దిల్లీ: స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌కు సంబంధించి వివిధ దేశాల్లో ఉన్న రికార్డులు, దస్త్రాలను భారత్‌కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసినట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్‌ రాజ్యసభలో వెల్లడించారు. ఈ మేరకు పలు దేశాలకు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. నేతాజీ మరణంపై అనుమానాలను నివృత్తి చేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాల గురించి సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. 

‘‘నేతాజీకి సంబంధించిన రికార్డులుంటే భారత్‌కు అప్పగించాలని యూకే, యూఎస్‌, రష్యా, జపాన్‌, చైనా దేశాలను కోరాం. 62 దస్త్రాలు నేషనల్‌ ఆర్కీవ్స్‌ అండ్‌ బ్రిటీష్‌ లైబ్రరీలో అందుబాటులో ఉన్నాయని యూకే వెల్లడించింది. తమ వద్ద నేతాజీకి సంబంధించి ఏ పత్రాలూ లేవని రష్యా ప్రభుత్వం తెలిపింది. భారత్‌ విజ్ఞప్తి మేరకు ప్రత్యేక ఆన్వేషణ చేపట్టినా ఏమీ లభించలేదని పేర్కొంది. జపాన్‌ వద్ద రెండు దస్త్రాలు ఉండగా.. వాటని నేషనల్‌ ఆర్కీవ్స్‌ ఆఫ్‌ ఇండియాకు బదిలీ చేసింది. తమ పరిశీలనలో ఇంకేమైనా లభిస్తే నిబంధనలకు లోబడి భారత్‌కు అప్పగిస్తామని జపాన్‌ అధికారులు తెలిపారు. అమెరికా విషయానికొస్తే 30 ఏళ్లకు మించి చారిత్రక రికార్డులేవి భద్రపర్చబోమని అక్కడి అధికారులు తెలిపారు. నేతాజీ కాలం నాటి రికార్డులను డిజిటలైజ్‌ చేయలేదని పేర్కొన్నారు’’అని కేంద్ర మంత్రి వివరణ ఇచ్చారు. 

నేతాజీ అదృశ్యం వెనుక రహస్యాలను తెలుసుకునేందుకు నియమించిన కమిషన్లలో రెండు కమిషన్ల నివేదికలు ఆయన 1945, ఆగస్టు 18న విమాన ప్రమాదంలో మరణించినట్లు ధ్రువీకరిస్తున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. జస్టిస్‌ ఎం.కే ముఖర్జీ నేతృత్వంలోని మరో కమిషన్‌ మాత్రం నేతాజీ ఆ ప్రమాదంలో మరణించలేదని నివేదిక ఇచ్చినట్లు చెప్పారు. నేతాజీ అదృశ్యానికి సంబంధించిన అన్ని వాస్తవాలు, పరిస్థితులపై విచారణ చేసేందుకు ప్రభుత్వం 1999లో జస్టిస్ ముఖర్జీ కమిషన్‌ను ఏర్పాటు చేసిందని వివరించారు. నివేదికలో ఓ చోట ‘జపాన్‌లోని ఓ బౌద్ధ ఆలయంలో ఉన్న చితాభస్మం.. నేతాజీదే కావొచ్చు’’అని పేర్కొన్నట్లు చెప్పారు. జస్టిస్‌ ముఖర్జీ కమిషన్‌ నివేదికలు నేషనల్‌ ఆర్కీవ్స్‌ ఆఫ్‌ ఇండియాలో పొందుపర్చినట్లు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని