Fuel prices: ఆ 8 రాష్ట్రాల్లోనే పెట్రోల్‌ ధరలెక్కువ.. విపక్షాలపై భాజపా మండిపాటు

విపక్షాలు అధికారంలో ఉన్న పది రాష్ట్రాల్లోనే ఇంధన ధరలు భారీగా ఉన్నాయని భాజపా ప్రతిదాడికి దిగింది.

Published : 28 Apr 2022 01:29 IST

దిల్లీ: ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అధికంగా ఉన్నాయంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యాలపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయినప్పటికీ ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్న భాజపా.. విపక్ష పార్టీలపై మండిపడుతోంది. విపక్షాలు అధికారంలో ఉన్న పది రాష్ట్రాల్లో ఎనిమిదింటిలోనే ఇంధన ధరలు భారీగా ఉన్నాయని పేర్కొంది. ముఖ్యంగా ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోనే ఇంధన ధరలు తక్కువ ఉన్నాయంటూ ప్రతిదాడికి దిగింది.

పెట్రోల్‌ ధరలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ (రూ.121.40), మహారాష్ట్ర (120.51), తెలంగాణ (119.49) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో డీజిల్‌ ధరలూ అత్యధికంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రూ.107, తెలంగాణలో రూ.105.49, మహారాష్ట్రలో రూ.104.77గా ఉన్నట్లు భాజపా వెల్లడించింది. వీటితోపాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, కేరళ, ఝార్ఖండ్‌ రాష్ట్రాలు పన్నులు తగ్గించకపోవడంతో ఆయా రాష్ట్రాల్లో ఇంధన ధరలు అధికంగా ఉన్నాయని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించినప్పటికీ రాష్ట్రాలు మాత్రం వ్యాట్ తగ్గించడం లేదని ఆరోపించింది. భాజపా పాలిత రాష్ట్రాలతో పోలిస్తే ఈ ఏడు రాష్ట్రాలు మాత్రం అదనంగా రూ.11వేల కోట్ల ఆదాయాన్ని పొందుతున్నట్లు భాజపా ఆరోపించింది. దిల్లీలోనూ ఇంధన ధరలు అధికంగానే ఉన్నాయంటూ విమర్శలు గుప్పించింది.

వివిధ పన్నుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేస్తోందని భాజపా వెల్లడించింది. ఉచితంగా ఆహారధాన్యాలు అందించడం వల్ల రూ.లక్ష కోట్ల భారం పడిందని, కొవిడ్‌ వ్యాక్సిన్‌లను ఉచితంగా ఇవ్వడంతోపాటు కరోనా సమయంలో పేదలకు నగదు బదిలీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నట్లు భాజపా పేర్కొంది.

‘2014 నుంచి 2021 మధ్యకాలంలో ఇంధనంపై పన్నుల వల్ల కేంద్ర ప్రభుత్వం రూ.26.5 లక్షల కోట్ల ఆదాయాన్ని గడించినట్లు కాంగ్రెస్‌ పార్టీ చెబుతోంది. కానీ, ఇదే సమయంలో రూ.90.9 లక్షల కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది’ అని భాజపాకు చెందిన ఓ అగ్రనేత వివరించారు. ఇందులో మౌలిక సదుపాయాల ఆధునికీకరణ, ఉత్పాదకతను పెంచడానికి మూలధన వ్యయం రూపంలో రూ.26లక్షల కోట్లు ఖర్చు చేయగా.. మరో రూ.25లక్షల కోట్లను ఆహారం, ఎరువులు, ఇంధన సబ్సిడీలకు ఖర్చు చేశామన్నారు. వీటితో పాటు ఆరోగ్యం, విద్య, గృహకల్పన వంటి కార్యక్రమాల కోసం మరో రూ.10 లక్షల కోట్లు ఖర్చు పెట్టినట్లు చెప్పుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని