Devendra Fadnavis : అయోధ్య రామమందిరాన్ని సందర్శించిన షిండే, ఫడణవీస్‌

అయోధ్య రామాలయ్యాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు.

Updated : 09 Apr 2023 17:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే(Eknath Shinde), ఉపముఖ్యమంత్రి  దేవేంద్ర ఫడణవీస్‌(Devendra Fadnavis)లు ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామాలయాన్ని సందర్శించారు. వారు అక్కడ రామ్‌లల్లా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వీరి వెంట దాదాపు 3,000 మంది శివసేన కార్యకర్తలు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సందర్భంగా శిందే మాట్లాడుతూ అయోధ్యలో భవ్య రామాలయం నిర్మించాలన్న శివసేన వ్యవస్థాపకులు బాల్‌ ఠాక్రే  కలను ప్రధాని నరేంద్ర మోదీ పూర్తి చేస్తున్నారన్నారు. నగరంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని చూసి తాను సంతోషిస్తున్నట్లు చెప్పారు. 

అనంతరం వీరు రామ్‌కథా హెలిప్యాడ్‌ వద్దకు చేరుకొన్నారు. రామాలయం వద్ద మహా ఆర్తీలో వీరు పాల్గొననున్నారు.  ఈ రోజు సాయంత్రం సరయూ నదీ తీరాన ఈ కార్యక్రమం జరగనుంది. ఈ పర్యటనలో వారు రామమందిర నిర్మాణాన్ని పరిశీలించారు. మహారాష్ట్ర తరపున మందిరానికి టేకును విరాళంగా ఇవ్వనున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కూడా ఆయన భేటీకానున్నారు. వేల మంది శివసైనికులు అయోధ్యకు తరలిరావడంతో నగరం మొత్తం కిక్కిరిసిపోయింది.

ఏక్‌నాథ్‌ శిందే అయోధ్యను తరచూ సందర్శిస్తారు. 2018 నవంబర్‌లో శివసేన నాయకుడిగా అయోధ్యకు వచ్చారు. ఆ తర్వాత ఏడాదికి రామజన్మభూమి వివాదంపై తీర్పు వెలువడింది. 2020 మార్చిలో మరోసారి ఈ నగరానికి వచ్చారు. గతేడాది జూన్‌లో కూడా శిందే అయోధ్యను సందర్శించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని