Published : 04 Jul 2022 01:40 IST

Maharashtra: ప్రభుత్వం నేతలే ప్రతిపక్షంగా మారారు.. సీఎం పదవి దక్కడం యాదృచ్ఛికం: శిందే

ముంబయి: మహారాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఆదివారం ప్రారంభం కాగా, తొలిరోజు స్పీకర్‌ పదవికి ఎన్నిక పూర్తయింది. ఈ సందర్భంగా నయా సీఎం ఏక్‌నాథ్‌ శిందే అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడారు. భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని అందరూ భావించారని, కానీ ఆ పదవి తనకు దక్కడం యాదృచ్ఛికం అని పేర్కొన్నారు. గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘ఇప్పటివరకు ప్రతిపక్షంలో ఉన్న నేతలే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాయి. కానీ, ఈసారి ప్రభుత్వంలో ఉన్న నేతలే ప్రతిపక్షంగా మారారు’ అని శిందే వ్యాఖ్యానించారు. తనకు మద్దతివ్వాలని ఏ ఎమ్మెల్యేను కూడా బలవంతం చేయలేదని వెల్లడించారు.

ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కూలిపోయేలా చేసిన తిరుగుబాటు గురించి శిందే మాట్లాడారు. మంత్రులతో సహా చాలా మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వం నుంచి వైదొలగడం మామూలు విషయం కాదన్నారు. ‘బాలాసాహెబ్ ఠాక్రే ఆనంద్ డిఘేల భావజాలానికి అంకితమైన నా లాంటి సాధారణ కార్యకర్తకు ఇది చాలా పెద్ద విషయం’ అని అన్నారు. కొంతమంది రెబల్‌ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని ఉద్ధవ్‌ ఠాక్రే చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ మాజీ సీఎంను పరోక్షంగా విమర్శించారు. ‘కొందరు మా ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఆ సంఖ్యను 5, 10, 20, 25 ఇలా పెంచుకుంటూ పోయారు. కానీ, అదంతా తప్పని నిరూపితమైంది’ అని పేర్కొన్నారు.

‘సీఎం పదవి నాకు దక్కుతుందని ఊహించలేదు. భారతీయ జనతా పార్టీకి 115 ఎమ్మెల్యేలుండగా, నాకు 50 మంది మద్దతు ఉంది. కానీ, భాజపా పెద్ద మనసుతో నాకు సీఎం పదవిని అప్పజెప్పింది. ఇందుకు ప్రధాని మోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డాలకు ధన్యవాదాలు. బాలాసాహెబ్‌ ఠాక్రే భావజాలానికి అనుకూలంగా ఇప్పుడు భాజపా-శివసేన ప్రభుత్వం ఏర్పడింది. బాలాసాహెబ్‌ సైనికుడు సీఎం అయ్యారు’ అని శిందే వ్యాఖ్యానించారు.

శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఆదివారం ప్రారంభం కాగా స్పీకర్‌ పదవికి ఎన్నిక పూర్తయింది. ‘హెడ్‌ కౌంట్‌’ పద్ధతిలో ఓటింగ్‌ నిర్వహించగా.. భాజపా ఎమ్మెల్యే రాహుల్‌ నర్వేకర్‌ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఆయనకు మొత్తం 164 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. మహా వికాస్‌ అఘాడీ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన ఎమ్మెల్యే రాజన్‌ సాల్వికి 107 ఓట్లు దక్కాయి. కాగా, ఏక్‌నాథ్‌ శిందే ప్రభుత్వం సోమవారం బలపరీక్ష ఎదుర్కోనుంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని