Published : 04 Jul 2022 18:09 IST

Eknath Shinde: చనిపోయిన పిల్లలను గుర్తుచేసుకుని.. కన్నీళ్లు పెట్టుకున్న శిందే

ముంబయి: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు ఏక్‌నాథ్‌ శిందే. ఈ ఉదయం జరిగిన  విశ్వాస పరీక్షలో 164 ఓట్లతో నెగ్గారు. బలపరీక్ష తర్వాత తొలిసారిగా శాసనసభలో మాట్లాడిన శిందే.. ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. చనిపోయిన తన పిల్లలను గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఠాక్రే ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన నేపథ్యంలో తన కుటుంబానికి వచ్చిన బెదిరింపుల గురించి ప్రస్తావిస్తూ శిందే ఉద్వేగానికి గురయ్యారు. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి తన కుమారుడు శ్రీకాంత్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులెవరికీ తాను సమయాన్ని కేటాయించలేకపోతున్నానని అన్నారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తన ఇద్దరు పిల్లలను గుర్తుచేసుకుని శిందే కన్నీరుమున్నీరయ్యారు. ‘‘నేను ఠాణెలో శివసేన కార్పొరేటర్‌గా ఉన్నప్పుడు నా ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఆ ఘటన తర్వాత నేను ఎందుకు బతికి ఉండాలి అనిపించింది. ఇక రాజకీయాలను వదిలి, నా కుటుంబాన్ని చూసుకుంటే చాలు అనిపించింది. కానీ, ఆనంద్ దిఘేజీ నన్ను ఓదార్చారు. నా కన్నీళ్లు తుడిచారు. ఆ బాధ నుంచి నన్ను బయటపడేసి ఓ మంచి నేతగా నన్ను తయారు చేశారు’’ అంటూ శిందే ఉద్విగ్నభరితులయ్యారు.

సీఎం పదవి కోసం ఆశపడలేదు..

‘‘2019లో మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ముందు నన్నే ముఖ్యమంత్రిని చేయాలనుకున్నారు. కానీ అజిత్‌ పవార్‌ లేదా ఇంకెవరో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అప్పుడు నాకు ఏ సమస్యా లేదని చెప్పాను. ఉద్ధవ్‌జీని సీఎంను చేయమని, ఆయనతో కలిసి పనిచేస్తానని అన్నాను. సీఎం పదవి కోసం ఏనాడూ ఆశపడలేదు. పార్టీ, ప్రజల కోసమే పనిచేశా. మేం నిజమైన శివసైనికులం. బాలాసాహెబ్‌, ఆనంద్ దిఘే నేర్పిన సిద్ధాంతాలకు అనుగుణంగా జీవితంగా శివసైనికులుగానే ఉంటాం’’ అని శిందే చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా దేవేంద్ర ఫడణవీస్‌కు శిందే మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వంలో తనను ఫడణవీస్‌ మంత్రిగా చేశారని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు కూడా తనపై నమ్మకంతో సీఎం బాధ్యతలను అప్పగించారని ధన్యవాదాలు తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని