Shinde vs Uddhav: ‘పిల్లాడిలా ఎన్నిసార్లు ఏడుస్తారు’ - ఉద్ధవ్‌పై మండిపడ్డ శిందే!

మరికొన్ని నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ‘శివసేన’ నేతల మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలయ్యింది.

Published : 08 Jul 2024 00:08 IST

ముంబయి: పార్టీ గుర్తును తస్కరించారని శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే ఆరోపించడంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే మండిపడ్డారు. శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాలాసాహెబ్‌ సిద్ధాంతాలను విడిచిపెట్టి ఏం తప్పు చేశారో అనే విషయాన్ని వాళ్లు త్వరలోనే తెలుసుకుంటారని అన్నారు. మరికొన్ని నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ‘శివసేన’ నేతల మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలయ్యింది.

‘‘చిన్న పిల్లాడిలా ఎన్నిసార్లు ఏడుస్తారు. పంచాయతీ ఎన్నికల్లో తాము రెండో స్థానంలో నిలవగా.. వారు ఆరోస్థానానికి పరిమితమయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో వాళ్లకంటే ఎక్కువ ఓట్లు మాకే వచ్చాయి. పార్టీ గుర్తును తస్కరించామని ఎన్నిసార్లు చెబుతారు. బాలాసాహెబ్‌ ఠాక్రే ఆశయాలను ఉద్ధవ్‌ వర్గం పక్కన పెట్టినందునే ఓటర్లు మా పక్క నిలుస్తున్నారు. శివసేన ఎవరిదనేది ప్రజలే ధ్రువీకరించారు. అసలైన శివసేన ఓటరు మాతోనే ఉన్నాడనే విషయం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్లే తెలుసుకుంటారు’’ అని ఏక్‌నాథ్‌ శిందే బదులిచ్చారు. ఇక ఇంటి గేటు బయటకు వెళ్లని కొందరు వ్యక్తులు (ఉద్ధవ్‌ను ఉద్దేశిస్తూ) ఇప్పుడు రైతులతో భేటీ అవుతుండటం సంతోషించదగిన విషయమన్నారు.

ఔరంగాబాద్‌లో ఇటీవల ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్ధవ్‌ ఠాక్రే మాట్లాడుతూ.. ఏక్‌నాథ్‌ శిందే వర్గంపై నిప్పులు చెరిగారు. విల్లు-బాణం గుర్తును తమ నుంచి కొందరు తస్కరించినప్పటికీ.. బాలాసాహెబ్‌ ఇచ్చిన స్ఫూర్తితో ‘కాగడా’ గుర్తును పోరాడి సాధించినందుకు గర్వపడుతున్నానని అన్నారు. బడ్జెట్‌ కేటాయింపులపై మాట్లాడిన ఠాక్రే.. ఓటర్లను ప్రలోభపెట్టేందుకే మహాయుతి ప్రభుత్వం కొత్త పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. వీటిపైనా ఏక్‌నాథ్‌ శిందే స్పందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని