Germany Case: మూడేళ్ల ఆ పాప కోసం.. విదేశాంగ మంత్రికి సీఎం శిందే లేఖ

జర్మనీలో ఏడాదిన్నరగా చిక్కుకుపోయిన చిన్నారి అరిహా షా కేసుకు సంబంధించి.. వారి తల్లిదండ్రులకు అపాయింట్‌మెంటు ఇవ్వాలని కోరుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే, భారత విదేశాంగమంత్రి ఎస్‌ జైశంకర్‌కు లేఖ రాశారు. 

Published : 02 Jun 2023 21:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జర్మనీలో ఏడాదిన్నరగా చిక్కుకుపోయిన తమ చిన్నారి కోసం ఆ తల్లిదండ్రులు పడుతున్న వేదన వర్ణణాతీతం. లైంగిక వేధింపులు జరగలేదని తేలినప్పటికీ.. తమ పాప అనాథాశ్రమంలోనే ఉండిపోవడం వారికి తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. అయినా వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా విషయంపై విదేశాంగ మంత్రి జైశంకర్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే లేఖ రాయడంతో వారిలో ఆశ చిగురించింది. ఇటీవల ఆ చిన్నారి తల్లిదండ్రులు సీఎం శిందేను కలిసి తమ గోడు వినిపించారు. దీనిపై స్పందించిన ఆయన.. ఈ కేసు వివరాలు వినేందుకు వీలుగా వారికి వ్యక్తిగత అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని విదేశాంగ మంత్రిని కోరుతూ లేఖ రాశారు. మరో రెండు నెలల్లో తమ వీసా గడువు ముగిసిపోతుందని.. తర్వాత తమ చిన్నారిని చూసుకోలేమని ఆందోళన చెందుతోన్న నేపథ్యంలోనే మహారాష్ట్ర సీఎం కేంద్రానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది.

అసలేం జరిగిందంటే..

ముంబయికి చెందిన భవేష్‌ షా, ధారా షా దంపతులు 2018లో ఉపాధి నిమిత్తం జర్మనీకి వెళ్లారు. అక్కడే వారికి ఓ ఆడబిడ్డ అరిహా షా జన్మించింది. ఆ పాపకు సుమారు ఏడాదిలోపు వయసున్నప్పుడు ఆడుకుంటూ కింద పడిపోవడంతో ప్రైవేటు అవయవం వద్ద గాయమైంది. దీంతో ఆమెను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్ఛార్జ్‌ చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆస్పత్రి నుంచి ఫోన్‌ వచ్చింది. పాపను చెకప్‌కు తీసుకురావాలని చెప్పడంతో ఆ తల్లిదండ్రులు వెళ్లారు. అయితే, అప్పటికే అక్కడికి వచ్చిన శిశు సంరక్షణ అధికారులు.. జర్మనీలో పుట్టిన ఆ పాప సంరక్షణ తమదేనని, చిన్నారిని ఇవ్వబోమని తేల్చిచెప్పారు. చిన్నారికి అయిన గాయం తీరు కారణంగా ఆమెపై లైంగిక దాడి జరిగి ఉండవచ్చన్న అనుమానాలతో ఆ పాపను అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.

అయితే, ఈ కేసులో పోలీసులు దర్యాప్తు జరపగా.. లైంగిక వేధింపులు జరగలేదని కేసు మూసేశారు. పాపను అప్పగించాలని అప్పటి నుంచి జర్మనీలోని చిన్నారుల సంరక్షణ అధికారులను వేడుకున్నా.. వారు తల్లిదండ్రులపైనే తిరిగి కేసు పెట్టారు. తల్లిదండ్రులుగా పిల్లల్ని పెంచే సమర్థతను నిరూపించుకోవాలని కోర్టు ఆదేశించడంతో... చిన్నారి సంరక్షణ కేంద్రంలోనే ఉండిపోయింది. మరో రెండు నెలల్లో వారి వీసా గడువు ముగిసిపోనుండటంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై భారత విదేశాంగ శాఖ సహాయం చేయాలని వేడుకుంటున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని