Rajasthan: చెత్త ఏరుకునే వృద్ధుడి ఆత్మహత్య.. వైరల్‌ వీడియో వేధింపులే కారణం..!

ఆన్‌లైన్‌ మీమ్‌లు, వైరల్‌ వీడియోల పిచ్చిలో యువత మానవత్వాన్ని మర్చిపోతోంది. చిన్న చిన్న పనులు చేసుకొని పొట్టపోసుకొనే వారిని కూడా హేళన చేస్తోంది. ఇలాంటి వేధింపులు ఓ వృద్ధుడి ప్రాణాలు తీశాయి. 

Published : 24 Jun 2024 16:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వైరల్‌ వీడియోలు సృష్టించాలని తహతహలాడే ఆన్‌లైన్‌ పిచ్చోళ్ల అరాచకాలకు అంతే లేకుండాపోతోంది. వీధుల్లో చెత్త ఏరుకునే వృద్ధులను కూడా వీరు వదలడం లేదు. ఇటీవల ఓ వృద్ధుడు వీరి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని లోహావత్‌లో చోటుచేసుకొంది.

బర్మేర్‌ జిల్లా చోహ్‌టాన్‌ గ్రామానికి చెందిన ప్రతాప్‌ రామ్‌సింగ్‌ అనే వృద్ధుడు వీధుల్లో పారేసిన ప్లాస్టిక్‌ బాటిళ్లను ఏరుకొని వాటిని విక్రయించగా వచ్చిన డబ్బుతో జీవిస్తున్నాడు. అతడు గ్రామంలో వారు ఎవరైనా చెత్తను కొనుగోలు చేస్తారేమోనని అడిగేవాడు. ఈ క్రమంలో కొందరు కుర్రాళ్లను కూడా అడిగాడు. వారు అతడి వీడియో తీసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. దీంతో అతడిని ఆ ప్రాంతంలో గుర్తుపట్టడంతో పాటు పలువురు హేళన చేయడం మొదలుపెట్టారు. ఈ వేధింపులతో అతడు కొన్నాళ్లుగా తీవ్ర మనస్థాపంతో ఉన్నాడు.

ఆదివారం కూడా అతడిని కొందరు హేళన చేశారు. దీంతో వారు చూస్తుండగానే పహ్లోదీ స్టేట్‌ హైవే వద్ద తన బండిని వదిలేసి.. పక్కనే ఉన్న చెట్టు ఎక్కాడు. ఏం జరుగుతోందో అక్కడ కొందరికి అర్థం కాలేదు.. మరికొందరు ఆకతాయిలు పారిపోయారు. వారు చూస్తుండగానే అతడు ఉరి వేసుకొన్నాడు. తక్షణమే సమాచారం అందుకొన్న పోలీసులు వచ్చి అతడి మృతదేహాన్ని కిందకు దించారు. 

కొన్నాళ్ల క్రితం ఓ జపాన్‌ మహిళా టూరిస్టు మిత్రులతో కలిసి మర్వార్‌ ప్రాంతాన్ని సందర్శించింది. అదే సమయంలో ప్రతాప్‌ రామ్‌సింగ్‌ తన పాత సామగ్రిని నింపిన బండితో ఆ మార్గంలో వెళుతుండగా.. అతడిని ఆమె పలకరించింది. తాను సాయం చేస్తానని ఆమె చెప్పగా.. ‘‘మీకేం కావాలి..? నా వద్ద ఉన్న చెత్తలో కొంత కొనుగోలు చేస్తారా?’’ అని అడిగాడు. దానిని కొందరు వీడియో తీసి ఆన్‌లైన్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. దాంతో అతడిని అందరూ వేధించడం మొదలుపెట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని