Karnataka Election: మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ

Karnataka Assembly Election:దేశంలో మరో ఎన్నికకు నగారా మోగింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈసీ నేడు ప్రకటించింది.

Updated : 17 Apr 2023 14:22 IST

దిల్లీ: దక్షిణాది రాష్ట్రం కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Election) షెడ్యూల్‌ ఖరారైంది. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) ఈ రాష్ట్రానికి శాసనసభ ఎన్నికల తేదీలను ప్రకటించింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 10వ తేదీన పోలింగ్‌ జరగనుంది. మే 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.  ఈ ఎన్నికలకు ఏప్రిల్‌ 13న గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది. ఏప్రిల్‌ 20 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నేటి నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది.

వృద్ధులకు ఇంటి నుంచే ఓటు..

రాష్ట్రంలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 2.62 కోట్లు, మహిళలు 2.59 కోట్లు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మొత్తం 58,282 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎన్నికల్లో ఈసీ తొలిసారిగా ‘ఓటు ఫ్రమ్‌ హోం (Vote From Home)’ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. 80 ఏళ్ల పైబడిన వృద్ధులు, అంగవైకల్యంతో బాధపడుతున్న వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని ఇంటి నుంచే ఓటు వేయొచ్చిన కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో మొత్తం 12.15 లక్షల మంది వృద్ధులు.. 5.6 లక్షల మంది దివ్యాంగులకు ప్రయోజనం కలగనుంది. ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్‌ కుమార్‌ ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. రాష్ట్రంలో 16,976 మంది 100ఏళ్లు పైబడిన ఓటర్లున్నట్లు తెలిపారు. శతాధిక వయసు గల ఓటర్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రం కర్ణాటకనే కావడం విశేషం.

కర్ణాటక (Karnataka)లో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రస్తుత శాసనసభ గడువు మే 25వ తేదీతో ముగియనుంది. ప్రస్తుత అసెంబ్లీలో భాజపా (BJP) సంఖ్యాబలం 119గా ఉండగా.. కాంగ్రెస్‌ (Congress)కు 75, జేడీఎస్‌ (JDS)కు 28 మంది ఎమ్మెల్యేలున్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భాజపా వ్యూహాలు రచిస్తుండగా.. రాష్ట్రాన్ని తిరిగి తమ చేతుల్లోకి తెచ్చుకోవాలని హస్తం పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో పాటు జేడీఎస్‌ పార్టీ కూడా తొలి విడత అభ్యర్థుల జాబితాలను విడుదల చేశాయి.

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో తొలుత భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే బలనిరూపణలో విఫలమవడంతో మూడు రోజులకే యడ్డీ దిగిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రాగా.. ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఏడాదికే కుప్పకూలింది. అనంతరం భాజపా మళ్లీ పగ్గాలు అందుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని