EC: ఇక, వారందరికీ ఇంటి నుంచే ఓటు.. ఈసీ కీలక నిర్ణయం

ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు ఈసీ (Election Commission) కీలక నిర్ణయం తీసుకుంది. 80ఏళ్లు పైబడినవారు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు (Vote-from-Home) వేసే సదుపాయాన్ని కల్పించేందుకు సిద్ధమైంది.

Published : 11 Mar 2023 20:41 IST

బెంగళూరు: కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లకు సిద్ధమవుతున్న ఎన్నికల సంఘం (Election Commission).. శనివారం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇక, 80 ఏళ్లు పైబడిన వారు, అంగవైకల్యంతో బాధపడేవారు ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. త్వరలో జరగబోయే కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో (Assembly elections) తొలిసారిగా ఈ ఓట్‌ ఫ్రమ్‌ హోమ్‌ (Vote-from-Home) సదుపాయాన్ని కల్పించబోతున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (CEC) రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు.

‘‘80 ఏళ్ల పైబడిన వారూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలనే మేం కోరుకుంటాం. కానీ, అలా రాలేని పరిస్థితుల్లో ఉన్న వృద్ధులు ఇంటి నుంచే ఓటు (Vote-from-Home) వేసే సదుపాయాన్ని తీసుకొస్తున్నాం. అలా ఇంటి నుంచే ఓటు వేసేవారి కోసం మా బృందాలు ఫామ్‌-12డీ పత్రాలను తీసుకుని వెళ్తాయి. ఈ ప్రక్రియంతా వీడియో రికార్డ్‌ చేస్తారు. అయితే, ఓటర్లు ఓటును మాత్రం రహస్యంగానే ఉంచుతాం. ఇంటి నుంచే ఓటు (Vote-from-Home) తీసుకునేప్పుడు ఆ సమాచారాన్ని అన్ని రాజకీయ పార్టీలకు చేరవేస్తాం’’ అని రాజీవ్‌ కుమార్‌ వివరించారు.

దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ‘సాక్షం’ పేరుతో ఓ మొబైల్‌ యాప్‌ను తీసుకొచ్చినట్లు సీఈసీ (CEC) తెలిపారు. ఆ యాప్‌లో వారు లాగిన్‌ అయి, ఈ ఇంటి నుంచే ఓటు సదుపాయాన్ని ఎంచుకోవచ్చని పేర్కొన్నారు. ఇక, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లను సమర్పించేందుకు ‘సువిధ’ అనే యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. ఈ యాప్‌ నుంచే అభ్యర్థులు తమ ప్రచార ర్యాలీలు, సభలకు అనుమతులు కూడా తీసుకోవచ్చని వెల్లడించారు.

కర్ణాటక (Karnataka) ప్రస్తుత శాసనసభ పదవీకాలం మే 24వ తేదీతో ముగియనుంది. ఆలోగా అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం ఎన్నికల సంఘం చర్యలు ప్రారంభించింది. సీఈసీ రాజీవ్‌ కుమార్‌ నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. త్వరలోనే ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 5.21కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో దాదాపు 17వేల మంది 100ఏళ్ల పైబడిన వారు కాగా.. 12.15లక్షల మంది 80ఏళ్లు దాటినవారు, 5.55లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. ఈసీ తాజా నిర్ణయంతో వీరందరికీ ప్రయోజనం చేకూరనుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు