Wayanad bypoll: వయనాడ్‌ ఉప ఎన్నిక.. సీఈసీ ఏం చెప్పారంటే..?

రాహుల్ గాంధీ (Rahul Gandhi) పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు పడడంతో  బుధవారం అక్కడ కేంద్ర  ఎన్నికల సంఘం ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల చేస్తుందని అంతా భావించారు. అయితే అలా జరగలేదు. దానికి సీఈసీ రాజీవ్‌ కుమార్ సమాధానం ఇచ్చారు. 

Updated : 29 Mar 2023 14:14 IST

దిల్లీ: కర్ణాటక(Karnataka) అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్(Election Commission) విడుదల చేసింది. ఈ సమయంలోనే కేరళలోని వయనాడ్‌(Wayanad) లోక్‌సభ స్థానానికి కూడా ఉప ఎన్నిక షెడ్యూల్‌ ప్రకటిస్తుందని వార్తలు వచ్చాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విజయం సాధించారు. అయితే ఆయన పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు పడడంతో వయనాడ్ స్థానం ఖాళీ అయినట్లు లోక్‌సభ సచివాలయం ఇదివరకే ప్రకటించింది. తాజాగా దీనిపై సీఈసీ రాజీవ్‌కుమార్ స్పందించారు. 

‘వయనాడ్ స్థానానికి ఉపఎన్నిక(Wayanad bypoll) ప్రకటించడానికి ఎలాంటి హడావుడి లేదు. రాహుల్‌ అప్పీల్ చేసుకోవడానికి ట్రయల్‌ కోర్టు నెలరోజుల సమయం ఇచ్చింది. మేం వేచి చూస్తాం. ఆ గడువు తర్వాత మేం స్పందిస్తాం’ అని రాజీవ్‌ కుమార్ వెల్లడించారు. చట్ట ప్రకారమే ఆ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించామని చెప్పారు.  ఆరునెలల్లో దానికి ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుందన్నారు. అయితే మిగిలిన పదవీకాలం సంవత్సరంలోపే ఉంటే.. అప్పుడు ఎన్నిక నిర్వహించాల్సిన పని లేదని చెప్పారు. కానీ వయనాడ్ విషయంలో అది ఏడాదికి మించి ఉంది.

మోదీ ఇంటిపేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువునష్టం (క్రిమినల్‌) కేసులో సూరత్‌ కోర్టు రాహుల్‌ (Rahul Gandhi)కు ఇటీవల రెండేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు వెలువడిన 24 గంటల్లోపే లోక్‌సభ సచివాలయం రాహుల్‌పై చర్యలు తీసుకుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం కింద.. ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని