త్వరలో రిమోట్‌ ఓటింగ్‌ మాక్‌ ట్రయల్స్‌

భారత్‌లో రిమోట్‌ ఓటింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు త్వరలో మాక్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునిల్‌ అరోరా తెలిపారు. 11వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

Published : 25 Jan 2021 15:26 IST

వెల్లడించిన ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునిల్‌ అరోరా

దిల్లీ: భారత్‌లో రిమోట్‌ ఓటింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు త్వరలో మాక్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునిల్‌ అరోడా తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కట్టింగ్‌ ఎడ్జ్‌ టెక్నాలజీ ఆధారంగా రిమోట్‌ ఓటింగ్‌పై పరిశోధనలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం రిమోట్‌ ఓటింగ్‌పై పరిశోధనల్లో మంచి పురోగతి కన్పిస్తోంది. త్వరలో వీటి మాక్‌ ట్రయల్స్‌ ప్రారంభమవనున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం ఎన్నికల కమిషన్‌ ఐఐటీ మద్రాస్‌తో కలిసి పనిచేస్తోంది. రిమోట్‌ ఓటింగ్ అందుబాటులోకి వస్తే దూరప్రాంతాల్లో ఉన్న ఓటర్లు తమ నియోజకవర్గాల్లోని పోలింగ్‌ స్టేషన్లకు వెళ్లకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.’’ అని  పేర్కొన్నారు.

డెడికేటెడ్ ఇంటర్నెట్‌ లైన్స్‌లు, బయోమెట్రిక్‌ పరికరాలు, వెబ్‌ కెమేరాలతో ఈ రిమోట్‌ ఓటింగ్‌ విధానం పనిచేస్తుందని ఎన్నికల మాజీ డిప్యూటీ కమిషనర్‌ సందీప్‌ సక్సేనా గతంలో తెలిపారు. ఈ సౌలభ్యాన్ని వినియోగించుకొనేందుక ఓటర్లు ముందుగా తమకు కేటాయించిన ప్రాంతానికి, వారికి కేటాయించిన సమయంలో చేరుకోవాలని ఆయన అన్నారు. రిమోట్‌ ఓటింగ్‌ అంటే ఇంటి నుంచి ఓటు వేయడం కాదన్నారు. ఓటు వినియోగించుకొనే ముందు బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీతో అనుసంధానమైన ఈ-బాలెట్‌ పేపర్‌ వస్తుందన్నారు. ఓటును వినియోగించుకున్న తర్వాత ఓటరుకు, వివిధ రాజకీయపార్టీలకు ఆ నోటిఫికేషన్‌ వెళ్తుందని అధికారులు వెల్లడించారు. రిమోట్‌ ఓటింగ్‌లో వేసిన ఓట్లను లెక్కింపుకు ముందు సురక్షితంగా ఉన్నాయా లేదా అని పరీక్షిస్తారన్నారు. ఈ రిమోట్‌ ఓటింగ్‌ను వినియోగించుకొనేందుకు ఓటర్లు ముందుగా సంబంధిత రిటర్నింగ్‌ అధికారి వద్ద నమోదు చేసుకోవాల్సిఉంటుందని వారు తెలిపారు. మరోవైపు ఈ- ఓటరు కార్డును సోమవారం నుంచి కేంద్రం అందుబాటులోకి తీసుకురానుంది. దీనిని మొబైల్‌లోనూ, కంప్యూటర్లలోనూ డౌన్‌లోడ్‌ చేసుకొని ప్రింట్‌ తీసుకోవచ్చని ఈసీ తెలిపింది. జనవరి 25 సోమవారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా దీనిని అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇవీ చదవండి..

‘మీరు చెప్తే వింటారు’.. మోదీ తల్లికి రైతు లేఖ

భారత్‌-చైనా: 15 గంటలకు పైగా చర్చలు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని