Karnataka: ఎన్నికల వేళ.. ముఖ్యమంత్రి కారులో తనిఖీలు..!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) మే నెలలో జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే అక్కడ ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై (Basavaraj Bommai) ప్రయాణిస్తోన్న కారును నిలిపివేసిన ఎన్నికల అధికారులు.. అందులో తనిఖీలు నిర్వహించారు.

Published : 31 Mar 2023 18:47 IST

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో అక్కడ ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. దీంతో రాజకీయ పార్టీలు, నేతల ప్రచారంపై ఎన్నికల అధికారుల నిఘా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఓ దేవాలయానికి వెళ్తోన్న కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై కారును అడ్డుకున్న ఎన్నికల అధికారులు.. తనిఖీలు నిర్వహించారు. కర్ణాటక చిక్కబళ్లాపుర్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై శుక్రవారం ఉదయం బెంగళూరుకు సమీపంలోని ఘాటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి ఓ ప్రైవేటు కారులో బయలుదేరారు. చిక్కబళ్లాపురలోని హోసయుద్య చెక్‌పోస్టు వద్దకు వెళ్లగానే.. వాహనాన్ని నిలిపివేసిన అధికారులు.. అందులో తనిఖీలు చేపట్టారు. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న వాహనంలో అభ్యంతరకరమైనవి ఏమీ కనిపించకపోవడంతో కారు వెళ్లిపోయేందుకు అనుమతించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే, రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి బొమ్మై.. తన అధికారిక కారును ప్రభుత్వానికి అప్పగించారు. దీంతో ప్రైవేటు వాహనంలో ఆయన బయలుదేరినట్లు సమాచారం.

భాజపాకు మరో ఝలక్‌..

మరోవైపు మే 10న అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఖరారవడంతో రాజకీయ పార్టీలు ముమ్మర ప్రచారంలో మునిగిపోయాయి. ఇదే సమయంలో అసంతృప్తితో ఉన్న నేతలు ఇతర పార్టీల్లోకి చేరిపోతున్నారు. ఈ క్రమంలో కుడ్లిగి భాజపా ఎమ్మెల్యే ఎన్‌వై గోపాలకృష్ణ తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న ఆయన.. చిత్రదుర్గ జిల్లాలోని మొలకల్మూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వకపోవడంతో భాజపాలో చేరి.. సీనియర్‌ నేత శ్రీరాములుపై విజయం సాధించారు.

ఇటీవల భాజపాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు పార్టీని వీడిపోయారు. వారిద్దరు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరోవైపు జేడీఎస్‌ ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌ శ్రీనివాస్‌ కూడా పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఇదిలాఉంటే, కర్ణాటకలోని 224 శాసనసభ స్థానాలకు మే 10న ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని