Nitin Gankari: మస్క్‌ వస్తానంటే స్వాగతిస్తాం..కానీ, : గడ్కరీ

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ఎలక్ట్రిక్‌ కార్ల విక్రయాన్ని భారత్‌లో ప్రారంభిస్తానంటే కచ్చితంగా స్వాగతిస్తామని కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ అన్నారు. కానీ, భారత్‌లోనే తయారు చేయాలని షరతుపెట్టారు.

Published : 10 Dec 2022 01:46 IST

దిల్లీ: టెస్లా అధినేత, ట్విటర్‌ను హస్తగతం చేసుకున్న ఎలాన్‌ మస్క్‌ ఎలక్ట్రిక్‌ కార్ల విక్రయాన్ని భారత్‌లో ప్రారంభిస్తానంటే కచ్చితంగా స్వాగతిస్తామని కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ అన్నారు. కానీ, భారత్‌లోనే తయారు చేయాలని షరతుపెట్టారు. చైనాలోనో లేదంటే వేరే దేశంలోనో తయారు చేసి ఇక్కడ విక్రయిస్తామంటే కుదరదన్నారు. ‘అజెండా ఆజ్‌తక్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మస్క్‌ భారత్‌లోని ఏ రాష్ట్రంలో తయారీ యూనిట్లను నెలకొల్పినా కేంద్రం సహకరిస్తుందని అన్నారు. అన్ని రాయితీలను కల్పిస్తుందని స్పష్టం చేశారు. భారత్‌లో ఆటోమొబైల్‌ రంగంలో ఏటా రూ.7.5 లక్షల కోట్ల బిజినెస్‌ జరుగుతోందని చెప్పిన గడ్కరీ.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్‌ హబ్‌గా భారత్‌ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ ఆదాయం చేకూరుస్తున్న రంగం ఇదేనని అన్నారు. అంతేకాకుండా దాదాపు 4 కోట్ల మంది ఈ రంగం ద్వారా ఉపాధి పొందుతున్నారని చెప్పారు.

ఎలక్ట్రిక్‌ కార్లను టెస్లా సంస్థ అమెరికా, చైనా దేశాల్లో ఉత్పత్తి చేస్తోంది. వీటిని భారత్‌లో దిగుమతి చేసి విక్రయించేందుకు గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే, తొలుత విదేశాల్లో తయారైన కార్లను మాత్రమే భారత్‌లో విక్రయిస్తామని, ఆ తర్వాతే తయారీ యూనిట్‌ను స్థానికంగా నెలకొల్పుతామని ఎలాన్‌ మస్క్‌ గతంలో చెప్పారు. అయితే, మేక్‌-ఇన్‌-ఇండియాకు ప్రాధాన్యత ఇస్తున్న భారత ప్రభుత్వం ఎలాన్‌ మస్క్‌ ప్రతిపాదనలకు అంగీకరించలేదు. దీంతో టెస్లా తన ప్రయత్నాలను తాత్కాలికంగా విరమించుకుంది.

నేను భోజన ప్రియుడినే...!

గడ్కరీ తనను తాను భోజన ప్రియుడిగా పేర్కొన్నారు. సాయంత్రమైతే చాలు తొలుత తన మదిలో వచ్చే తీవ్రమైన ఆలోచన ఎక్కడ, ఏం తినాలనేనన్నారు. తిండిపై తన ఆలోచన తగ్గనప్పటికీ.. ఆహార వినియోగం మాత్రం తగ్గిపోయిందని తెలిపారు.  ‘‘నేను ఆహార ప్రియుడ్ని. సాయంత్రం 7గంటలు దాటిందంటే మొదట నా మదిని తొలిచే ఆలోచన.. ఏ హోటల్‌లో ఎలాంటి ఆహారం తినాలనే. నేను శాకాహారిని. ఎన్నో హోటళ్లకు వెళ్లా. తిండిపై నా ఉద్దేశం తగ్గనప్పటికీ.. ఆహారం తీసుకోవడం మాత్రం తగ్గింది’’ అని వివరించారు. ప్రజలు ఎప్పుడూ తమ ఆరోగ్యాన్నే ముందు చూసుకోవాలని సూచించిన గడ్కరీ.. ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని