EVMs Row: ఈవీఎంలపై మస్క్‌ చీకట్లు

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలపై మరోసారి రాద్ధాంతం మొదలైంది. వీటి విశ్వసనీయతపై సాంకేతిక దిగ్గజం, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ఆందోళన వ్యక్తం చేయగా కాంగ్రెస్‌ నేతలు ఆయనతో గొంతు కలిపారు.

Updated : 17 Jun 2024 05:22 IST

అమెరికాలో వీటిని వాడొద్దన్న టెస్లా అధినేత
మానవులతో, ఏఐతో ఎంతోకొంత ముప్పు ఉందని వెల్లడి
భారత్‌లో ఈవీఎంల భద్రతపై గళమెత్తిన కాంగ్రెస్‌.. తోసిపుచ్చిన భాజపా

దిల్లీ, ముంబయి: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలపై మరోసారి రాద్ధాంతం మొదలైంది. వీటి విశ్వసనీయతపై సాంకేతిక దిగ్గజం, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ఆందోళన వ్యక్తం చేయగా కాంగ్రెస్‌ నేతలు ఆయనతో గొంతు కలిపారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున వాయవ్య ముంబయి లోక్‌సభ నియోజకవర్గం శివసేన(శిందే వర్గం) అభ్యర్థి రవీంద్ర వైకర్‌ బంధువొకరు తన మొబైల్‌ ఫోన్‌ను ఈవీఎంకు అనుసంధానం చేశారన్న వార్తా కథనాన్ని కూడా ఉటంకిస్తూ వారు గళమెత్తారు. ఆ కథనాన్ని ప్రచురించిన పత్రికకు పరువునష్టం నోటీసు పంపినట్లు  రిటర్నింగ్‌ అధికారి వందనా సూర్యవంశీ తెలిపారు. ఈవీఎంలు విడివిడి యంత్రాలని, వాటిని ప్రోగ్రాం చేసే అవకాశం లేనందువల్ల వైర్లెస్‌ వ్యవస్థ సామర్థ్యాలేవీ ఉండవని స్పష్టంచేశారు. డేటా నమోదుకు తప్పిస్తే ఈవీఎంలు తెరిచేందుకు ఓటీపీ అవసరమే లేదని చెప్పారు. ‘తప్పుడు నివేదికతో అబద్ధాన్ని ప్రచారం చేస్తున్న’వారందరినీ ఈసీ విచారించాలని భాజపా డిమాండ్‌ చేసింది. 

అమెరికాలో హ్యాకింగ్‌కు అవకాశాలు

పోలింగ్‌ సమయంలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు హ్యాకింగ్‌కు గురవుతున్నాయంటూ ఎలాన్‌ మస్క్‌ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. అమెరికాలోని ప్యూర్టోరికోలో ఇటీవలి ప్రైమరీల ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో మస్క్‌ ఈ ఆరోపణలు చేశారు. వ్యక్తులు లేదా కృత్రిమ మేధ సాయంతో ఈవీఎంలను హ్యాక్‌చేసే ప్రమాదం కొద్దిగానే ఉన్నా అది తీవ్రమైనదేనని ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. ఈవీఎంలను తొలగించడంతో దానిని నివారించొచ్చని సూచించారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్‌-ఐటీ శాఖ మాజీ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఈ వాదనను తోసిపుచ్చారు. హ్యాకింగ్‌పై ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ, మస్క్‌ చాలా తేలిగ్గా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కనెక్టివిటీ, బ్లూటూత్‌ వైఫై, ఇంటర్నెట్‌ లేకుండా హ్యాకింగ్‌ చేయడం అసంభవమని తెలిపారు. అవసరమైతే మస్క్‌కు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమని చెప్పారు. భారత ఈవీఎంలకు ఇతర పరికరాలతో ఎలాంటి అనుసంధానం గానీ, విద్యుత్తు సరఫరా గానీ ఉండదని, బ్యాటరీతోనే పనిచేస్తాయని గుర్తుచేశారు. ‘‘అన్నింటిని సాధారణీకరిస్తూ మస్క్‌ ప్రకటన చేసినట్లుంది. సాధారణ కంప్యూటర్‌ ప్లాట్‌ఫాంలు వాడి, ఇంటర్నెట్‌కు అనుసంధానించేలా తయారుచేసిన ఈవీఎంలను వినియోగించే అమెరికా లేదా ఇతర దేశాల విషయంలో ఆయన చెప్పిన విషయాన్ని అన్వయించుకోవచ్చేమో. ఏ నెట్‌వర్క్‌ లేదా మీడియాతో అనుసంధానంకాని విధంగా భారత ఈవీఎంలను రూపొందించారు. వీటిని తిరిగి ప్రోగ్రాం చేయడానికి కూడా వీలుండదు’’ అని ఖండించారు. 

ఈవీఎంలు ‘బ్లాక్‌ బాక్సు’లు..: రాహుల్‌ 

ఈవీఎంలు- విమానాల్లోని బ్లాక్‌ బాక్సుల వంటివని, వాటిని పరిశీలించడానికి ఎవరినీ అనుమతించరని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత గురించి తీవ్రమైన ఆందోళనలు రేకెత్తుతున్నాయని, సంస్థలకు జవాబుదారీతనం లోపించినప్పుడు ప్రజాస్వామ్యం మిథ్యగా మారి, అవకతవకలకు ఆస్కారం కల్పిస్తుందని ‘ఎక్స్‌’లో ఆయన పేర్కొన్నారు. వాయవ్య ముంబయి నియోజకవర్గం గురించి వచ్చిన కథనాన్ని, ఎలాన్‌ మస్క్‌ తాజా వ్యాఖ్యలను కూడా ట్యాగ్‌ చేశారు. ఇకపై అన్ని ఎన్నికల్లో బ్యాలెట్‌ పత్రాలనే వాడాలని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు.


ఎంపీ బంధువు అరెస్ట్‌

ముంబయిలోని గోరేగావ్‌ ప్రాంత ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఈవీఎంను తెరవడానికి ఓటీపీ కోసం ఫోన్‌ వాడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంగేష్‌ పాండిల్కర్‌ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాయవ్య ముంబయి లోక్‌సభ స్థానానికి కొత్తగా ఎన్నికైన ఎంపీ రవీంద్ర వైకర్‌కు ఆయన బావమరిది. ఈయనకు మొబైల్‌ ఫోన్‌ ఇచ్చినందుకు ఓ ఉద్యోగిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శివసేన వర్గానికి చెందిన రవీంద్ర వైకర్, ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు చెందిన అమోల్‌ గజానన్‌ కీర్తికర్‌పై కేవలం 48 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఫలితాలపై అనుమానాలు ఉన్నాయని ఠాక్రే వర్గం ఆరోపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు కోసం పోలీసులు మూడు బృందాలను ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని