PM modi: భారత ప్రజాస్వామ్యంపై ‘ఎమర్జెన్సీ’ మాయని మచ్చ.. ఎన్నారైల సమావేశంలో మోదీ

జీ7 సదస్సు (G7 summit) కోసం జర్మనీలోని మ్యూనిచ్‌కు విచ్చేసిన ప్రధాని మోదీ.. అక్కడి భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

Published : 26 Jun 2022 21:51 IST

మ్యూనిచ్‌ (జర్మనీ): భారత్‌ తన సామర్థ్యంపై నమ్మకం ఉంచడం వల్లే పాత రికార్డులను బద్దలు కొడుతోందని ప్రధాని నరేంద్రమోదీ (PM modi) అన్నారు. జీ7 సదస్సు (G7 summit) కోసం జర్మనీలోని మ్యూనిచ్‌కు విచ్చేసిన ప్రధాని మోదీ.. అక్కడి భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజాస్వామ్యం కలిగిన దేశాలకు భారత్‌ తల్లిలాంటిదని మోదీ అన్నారు. కానీ, ఇందిరా హయాంలో దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి ప్రజాస్వామ్యంపై మాయని మచ్చలా మిగిలిపోయిందన్నారు. భారత్‌లో తయారైన కరోనా వ్యాక్సిన్‌ కోట్లాది మంది ప్రాణాలను కాపాడిందని చెప్పారు.

‘అవుతుందిలే.. నడుస్తుందిలే..’ అనే మానసిక స్థితి నుంచి భారత్‌ బయటకొచ్చిందని.. ‘చేయాలి.. చేయాల్సిందే’ అనే దృఢ సంకల్పంతో కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని దేశం ముందుకు సాగుతోందని ప్రధాని మోదీ అన్నారు. పారిశ్రామిక విప్లవం వల్ల గత శతాబ్దంలో జర్మనీ, ఇతర దేశాలకు లబ్ధి చేకూరిందని చెప్పారు. బ్రిటీష్‌ పాలన వల్ల భారత్‌ ఆ ఫలితాన్ని పొందలేకపోయిందన్నారు. ప్రస్తుతం భారత్‌లోని ప్రతి గ్రామానికీ, విద్యుత్‌, గ్యాస్‌ సిలిండర్‌ సౌలభ్యం ఉందన్నారు. భారత్‌లో 80 కోట్ల మందికి రెండేళ్లుగా ఉచిత రేషన్‌ అందిస్తున్నామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక 10 కోట్ల మరుగుదొడ్లు నిర్మించామని తెలిపారు. సొంత సామర్థ్యంపై నమ్మకం పెరగడం వల్లే భారత్‌లో వేగంగా అభివృద్ధి సాధ్యమవుతోందని మోదీ అన్నారు. అంతకుముందు జర్మనీ చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని