Delhi Airport: ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ

దిల్లీ (Delhi)లోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Indira Gandhi International Airport)లో ఎమర్జెన్సీ ప్రకటించారు. దుబాయ్‌కి వెళ్లాల్సిన విమానాన్ని పక్షి ఢీ కొట్టడంతో ల్యాండింగ్‌కు మార్గం సుగమం చేసేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Published : 01 Apr 2023 17:41 IST

దిల్లీ: దుబాయ్‌ వెళ్లాల్సిన ఫెడెక్స్‌ విమానాన్ని పక్షి ఢీ కొట్టడంతో దిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం విమానాల రాకపోకలను నిలిపివేశారు. ఎయిర్‌పోర్టు నుంచి ఫెడెక్స్‌ విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే దాదాపు 1000 అడుగుల ఎత్తులో దానిని పక్షి ఢీ కొట్టింది. అప్రమత్తమైన పైలట్లు విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. ల్యాండింగ్‌కు అనుకూల పరిస్థితులు కల్పించాల్సిందిగా కోరారు. దీంతో ఆ సమయంలో ల్యాండ్‌ అవ్వాల్సిన విమానాలను అధికారులు దారి మళ్లించారు. టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న విమానాలను కూడా నిలిపి వేసి ఫెడెక్స్‌ విమానం ల్యాండింగ్‌ మార్గం సుగమం చేశారు.

కొద్దిసేపటికి విమానం సేఫ్‌గా ల్యాండ్‌ అవ్వడంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే సాంకేతిక సిబ్బంది విమానానికి మరమ్మతులు చేపట్టారు. అంతా బాగానే ఉందని నిర్ధారించుకున్న తర్వాత విమానం మళ్లీ టేకాఫ్‌ అయ్యేందుకు అనుమతిచ్చారు. ఆ తర్వాత దిల్లీ నుంచి పయనమైన విమానం అహ్మదాబాద్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ల్యాండ్‌ అయినట్లు పౌరవిమానయాన డైరెక్టర్‌ జనరల్‌ (డీజీసీఏ) వెల్లడించారు. విమానం దిల్లీ నుంచి పయనమైన తర్వాత ఎమర్జెన్సీని సడలించి.. రాకపోకలను పునరుద్ధరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని