
Emmanuel Macron: ‘ఇలాంటి విషయాలపై సోషల్ మీడియా ద్వారా సంభాషణ తగదు’
రోమ్: ఇంగ్లిష్ ఛానల్ ద్వారా వలసల విషయంలో ఫ్రాన్స్, బ్రిటన్ మధ్య వివాదం రాజుకుంటోంది! తాజాగా ఈ వ్యవహారంపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అనుసరించిన విధానం తనను ఆశ్చర్యపరిచిందని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ అన్నారు. ఇటీవల ఇంగ్లిష్ ఛానల్లో వలసదారుల పడవ బోల్తాపడిన ప్రమాదంలో దాదాపు 27 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఛానల్ ద్వారా ఇంగ్లాండ్‌కు చేరుకున్న వలసదారులను ఫ్రాన్స్ వెంటనే వెనక్కి రప్పించాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గురువారం సాయంత్రం ట్విటర్లో బహిరంగ లేఖ విడుదల చేశారు.
సమావేశానికి అహ్వానం రద్దు!
అయితే.. ఈ విధంగా సామాజిక మాధ్యమంలో లేఖ విడుదల చేయడంపై ఫ్రాన్స్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి విషయాల్లో ఒక నాయకుడు మరొకరితో ఇలా ట్విటర్ ద్వారా సమాచారం అందించరని మెక్రాన్ విమర్శలు చేశారు. ఈ తరహా వ్యవహారాలపై నాయకులు సోషల్ మీడియా ద్వారా పరస్పరం సంభాషించుకోవద్దని హితవు పలికారు. అంతకుముందు.. ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి గెరాల్డ్ డర్మానిన్ సైతం బ్రిటన్ మంత్రి ప్రీతి పటేల్‌తో ఈ లేఖ విషయమై నిరసన వ్యక్తం చేశారు. వలసదారుల సంక్షోభంపై ఇతర యూరోపియన్ మంత్రులతో నిర్వహించనున్న వారాంతపు సమావేశానికి యూకేను ఆహ్వానించేది లేదని స్పష్టం చేశారు.