Punjab: ఎన్నికల వేళ పంజాబ్‌లో ఈడీ సోదాలు.. సీఎం చన్నీ బంధువుఇంట్లో తనిఖీలు

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పంజాబ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాలు కలకలం రేపుతున్నాయి. అక్రమ ఇసుక తవ్వకాల కేసుకు సంబంధించిన దర్యాప్తులో

Published : 18 Jan 2022 12:10 IST

చండీగఢ్‌: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పంజాబ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాలు కలకలం రేపుతున్నాయి. అక్రమ ఇసుక తవ్వకాల కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా నేడు సోదాలు చేపట్టిన ఈడీ అధికారులు.. రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ బంధువు నివాసంలోనూ తనిఖీలు జరుపుతున్నారు. చన్నీ బంధువు భూపిందర్‌ సింగ్‌ హనీ నివాసంతో పాటు మరో 10 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

చన్నీ మరదలి కుమారుడైన భూపిందర్‌ సింగ్‌ హనీ.. పంజాబ్‌ రియల్టర్స్‌ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతూ కోట్ల కొద్దీ నల్లధనాన్ని ఆర్జిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు మనీలాండరింగ్‌ కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే భూపిందర్ నివాసంతో పాటు కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. 

మరికొద్ది వారాల్లో పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఈ సోదాలు చర్చనీయాంశంగా మారాయి. భాజపా కుట్రపూరితంగానే దర్యాప్తు సంస్థలతో దాడులకు పాల్పడుతోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. ‘‘ఈసీ ఎన్నికల తేదీలు = భాజపా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులు. పంజాబ్‌లో భాజపా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది’’ అంటూ ఇండియన్‌ యూత్‌ కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు ట్విటర్‌ వేదికగా భాజపాపై విమర్శలు గుప్పించారు.

పంజాబ్‌ ఎన్నికల ప్రచారంలో అక్రమ ఇసుక తవ్వకాలు ప్రధానాంశంగా మారింది. ఇటీవల కాంగ్రెస్‌ మాజీ నేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌.. ఇసుక మైనింగ్‌ గురించి రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ను వీడిన అనంతరం కెప్టెన్‌ మాట్లాడుతూ.. ‘‘ఇసుక అక్రమ రవాణాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలందరూ భాగస్వాములే. నేను పేర్లు చెప్పడం మొదలుపెడితే.. టాప్‌ (సీఎంను ఉద్దేశిస్తూ) నుంచి చెప్పుకుంటూ రావాలి’’ అని ఆరోపించారు. 

అటు ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా ఈ విషయంలో చన్నీపై పలు మార్లు విమర్శలు గుప్పించింది. సీఎం చన్నీ సొంత నియోజకవర్గమైన చామ్‌కౌర్‌ సాహిబ్‌లో అక్రమ ఇసుక తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయని గతేడాది డిసెంబరులో ఆప్‌ ఆరోపించింది. పంజాబ్‌లో ఫిబ్రవరి 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని