భారత్‌లో వ్యాక్సినేషన్‌.. సిద్ధంగా ఉన్నాం..

తొలి విడత పంపిణీకి సరిపడా కొవిడ్‌ టీకా నిల్వ, సామర్థ్యం భారత్‌ వద్ద ఉంది.

Published : 04 Jan 2021 18:04 IST

నీతి ఆయోగ్‌ వివరణ..

దిల్లీ: ఆక్స్‌ఫర్డ్‌ టీకా కొవిషీల్డ్‌, భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌లకు అత్యవసర అనుమతులు లభించిన అనంతరం.. దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో తొలి విడత పంపిణీకి సరిపడా కొవిడ్‌ టీకా నిల్వ, సామర్థ్యం భారత్‌ వద్ద ఉందని.. నీతి ఆయోగ్‌ సభ్యులు వీకే పాల్‌ తెలిపారు. కొవిడ్‌ టీకా కొనుగోలు, పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన ప్రణాళికను త్వరలో ప్రకటిస్తామని పాల్‌ తెలిపారు.  కొవిడ్‌ టీకా కార్యక్రమానికి సంబంధించిన సాధికార సంస్థ ‘నేషనల్‌ ఎక్స్‌పర్ట్‌ గ్రూప్‌ ఆన్‌ వ్యాక్సిన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఫర్‌ కొవిడ్‌-19’ (నెగ్‌వ్యాక్) ఛైర్మన్‌గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. మూడు నాలుగు నెలల అనంతరం మరిన్ని రకాల టీకాలు భారత్‌లో అందుబాటులోకి వస్తాయని.. తద్వారా మన టీకా నిల్వలు మరింతగా పెరుగుతాయన్నారు.

అతిపెద్ద సవాలు ఇదే..

ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి కేటాయించిన సమయంలో, ప్రదేశంలో నిబంధనలకు అనుగుణంగా అర్హులైన వారిని సమీకరించటమే  తమ ముందున్న పెద్ద సవాలని పాల్‌ విశ్లేషించారు. దేశంలో కరోనాను అరికట్టాలంటే కనీసం 70 శాతం సామూహిక రోగనిరోధక శక్తిని సాధించాలని ఆయన వెల్లడించారు. ఇది వ్యాక్సినేషన్‌ ద్వారా లేదా సహజంగా లభించినదైనా కావచ్చని ఆయన తెలిపారు. దేశ పారిశ్రామిక, విద్యా, రవాణా, న్యాయ, పార్లమెంటరీ వ్యవస్థలు సక్రమంగా సాగేందుకు, ప్రజలు గతంలోలా సాధారణ జీవితం గడిపేందుకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను విజయవంతంగా చేపట్టడం తప్పనిసరన్నారు. తద్వారా దేశంలో ఆర్థిక, సామాజిక జీవితం సాధారణ స్థాయికి చేరుకుంటుందన్నారు.

వయోజనులకు టీకా ఎలా..

భారత్‌లో వయోజనులకు వ్యాక్సిన్‌ ఇవ్వటం ఇదే తొలిసారి. అనుభవం లేని  ఈ విషయంపై ఆయన స్పందించారు. ప్రతిదేశం కొత్త సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంటుందని.. దానికి ఏ విధంగా స్పందించేదీ ఆ దేశ అంతర్గత సామర్ధ్యం మీద ఆధారపడి ఉంటుందని  వివరించారు. ఆ అనుభవాలు దేశ నిర్మాణంలో కీలక పాత్ర వహిస్తాయన్నారు. ఈ విధమైన కార్యక్రమాన్ని ఇదివరకు చేపట్టని సంగతి నిజమే అయినప్పటికీ.. మనకున్న సాంకేతికత, అనుభవంతో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం సాధ్యమే అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి..

టీకా పంపిణీ.. త్వరలోనే ప్రారంభం

 సౌదీ.. ప్రయాణ ఆంక్షల ఎత్తివేత

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని