Modi: క్రిప్టో కరెన్సీ తప్పుడు చేతుల్లోకి వెళ్లకూడదు.. అది మన యువతకు ప్రమాదం

ఊహాజనిత నగదు క్రిప్టో కరెన్సీపై దేశాలన్నీ కలిసి పనిచేయాలని, అది తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఆస్ట్రేలియాలో

Published : 18 Nov 2021 10:37 IST

‘సిడ్నీ డైలాగ్‌’ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగం

దిల్లీ: క్రిప్టో కరెన్సీపై దేశాలన్నీ కలిసి పనిచేయాలని, అది అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ‘ది సిడ్నీ డైలాగ్‌’ సదస్సులో మోదీ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘ఇండియా టెక్నాలజీ: ఎవల్యూషన్‌ అండ్‌ రివల్యూషన్‌’’ అనే అంశంపై ప్రధాని కీలక ప్రసంగం చేశారు. 

‘‘మనం ఇప్పుడు కీలకమైన మార్పులు జరిగే దశలో ఉన్నాం. ఈ డిజిటల్‌ శకం మన చుట్టూ ఉన్న ప్రతిదాన్నీ మార్చేస్తోంది. రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలకు కొత్త అర్థాలు చెబుతోంది. సౌభ్రాతృత్వం, పాలన, విలువలు, చట్టం, హక్కులు, భద్రత తదితర అంశాలపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. అంతర్జాతీయ పోటీ, అధికారం, నాయకత్వానికి కొత్త రూపు తెస్తోంది. అభివృద్ధి, సంపదకు అవకాశాలు కల్పిస్తోంది. అయితే, ఇదే సమయంలో మనం కొత్త ప్రమాదాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. నేటి తరంలో టెక్నాలజీ, డేటా నూతన ఆయుధాలుగా మారుతున్నాయి. ప్రజాస్వామ్యానికి అతిపెద్ద బలం పారదర్శకత. దీన్ని స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉంది’’ అని మోదీ తెలిపారు. 

ఈ సందర్భంగా క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడుతూ.. ‘‘దీనిపై ప్రజాస్వామ్య దేశాలన్ని సమష్టిగా పనిచేయాల్సిన ఆవశక్యత చాలా ఉంది. ఇది తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూసుకోవాలి. లేదంటే అది మన యువతను నాశనం చేసే ప్రమాదం ఉంది’’ అని తెలిపారు. అనంతరం భారత సాంకేతికత గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ప్రపంచంలోనే మూడో అతిపెద్ద, వేగంగా అభివృద్ది చెందుతోన్న పర్యావరణ వ్యవస్థ భారత్‌ది. ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రజా సమాచార మౌలిక వ్యవస్థలను మేం నిర్మిస్తున్నాం. ఆరు లక్షల గ్రామాలను ఇంటర్నెట్‌తో అనుసంధానం చేసే మార్గంలో ఉన్నాం. టెక్నాలజీని ఉపయోగించుకునే వంద కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేయగలిగాం’’ అని మోదీ చెప్పుకొచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని