Corona Virus: పండుగలొస్తున్నాయ్‌ జాగ్రత్త.. కొవిడ్‌ నిబంధనల్ని మళ్లీ పొడిగించిన కేంద్రం

భారీగా జనం గుమిగూడకుండా చూడాలని, రద్దీ ప్రాంతాల్లో కొవిడ్‌ నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. దేశం మొత్తంగా చూస్తే ఈ మహమ్మారి పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం....

Updated : 28 Aug 2021 17:23 IST

రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ లేఖ

దిల్లీ: దేశంలో కొన్నాళ్లుగా తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి పలు రాష్ట్రాల్లో మళ్లీ బుసలు కొడుతోంది. దీంతో అప్రమత్తమైన కేంద్రం దేశ వ్యాప్తంగా ప్రస్తుతం అమలులో ఉన్న కొవిడ్‌ నిబంధనలు, మార్గదర్శకాలను మరోసారి పొడిగించింది. సెప్టెంబర్‌ 30 వరకు కొవిడ్‌ నిబంధనలు అమలు చేయాలని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. పండుగల సీజన్‌ కావడంతో మరింత కఠినంగా వ్యవహరించాలని కోరుతూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు లేఖ రాశారు.

భారీగా జనం గుమిగూడకుండా చూడాలని, రద్దీ ప్రాంతాల్లో కొవిడ్‌ నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలని అజయ్‌ భల్లా ఆదేశించారు. దేశం మొత్తంగా చూస్తే ఈ మహమ్మారి పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం తీవ్రత కొనసాగుతోందని  పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో భారీగా యాక్టివ్‌ కేసులు, పాజిటివిటీ రేటు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తంచేశారు. ఆయా జిల్లాల్లో కొవిడ్‌ కట్టడికి మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు, గడిచిన 24గంటల వ్యవధిలో దేశంలో 46,759 కొత్త కేసులు నమోదైన విషయం తెలిసిందే.

కరోనా వైరస్‌ను కట్టడి చేసేలా తగిన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. పండుగల సమయం కావడంతో జన సమూహాలను నియంత్రించేందుకు ఐదు అంచెల వ్యూహం (టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌, వ్యాక్సినేషన్‌, కొవిడ్‌ నిబంధనలు పాటించడం) కఠినంగా అమలు చేయాలని పేర్కొన్నారు.  నిబంధనలు పాటించని వారిపై చర్యలతో పాటు వ్యాక్సినేషన్‌ భారీగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాన్నారు.  అవసరమైతే స్థానికంగా ఆంక్షలు అమలు చేయాలని సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు