
ప్రాణాంతక ‘సూపర్‌బగ్’ ఆనవాళ్లు గుర్తింపు..!
మరో మహమ్మారి ముప్పు ఉందంటున్న శాస్త్రవేత్తలు
ఇంటర్నెట్ డెస్క్: కరోనా వైరస్ మహమ్మారితో వణికిపోతున్న ప్రపంచ దేశాలకు మరో మహమ్మారి రూపంలో ముప్పు పొంచి ఉందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఔషధాలను తట్టుకునే సామర్థ్యమున్న ‘సూపర్‌బగ్’గా పిలిచే బ్యాక్టీరియా ఆనవాళ్లు భారత్ తీరంలో తొలిసారిగా బయటపడ్డాయి. అండమాన్ దీవుల్లో గుర్తించిన ఈ సూపర్‌బగ్ ఆనవాళ్లు, రానున్న రోజుల్లో మరో మహమ్మారికి దారితీసే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పరిశోధనా పత్రం ఎంబయో జర్నల్‌లో ప్రచురితమైంది.
కరోనా మహమ్మారి విజృంభణ వేళ ఔషధాలకు లొంగని సీ.ఆరిస్ (క్యాండిడా ఆరిస్) అనే బ్యాక్టీరియా ఆనవాళ్లను తొలిసారిగా అండమాన్ దీవుల్లో గుర్తించినట్లు తాజా నివేదిక వెల్లడించింది. సూపర్‌బగ్‌గా పిలిచే ఈ ప్రాణాంతక బ్యాక్టీరియాను కనుక్కోవడం ఓ మైలురాయిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అదే సమయంలో, రానున్న రోజుల్లో ఈ సుపర్బగ్ మహమ్మారిగా విజృంభించే ప్రమాదమూ లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందే రోగులకు ఈ సూపర్‌బగ్ తీవ్ర అనారోగ్యాన్ని కలిగిస్తున్నట్లు ఇప్పటివరకు వచ్చిన నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, సాధారణ వాతావరణంలో వీటి మూలాలు బయటపడనప్పటికీ.. ఇది మానవులకు ఎలా సోకుతుందనే విషయం ఇప్పటికీ మిస్టరీగా మిగిలినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అండమాన్ తీరంలో ఆనవాళ్లు..
సూపర్‌బగ్‌కు సంబంధించిన అధ్యయనాన్ని యూనివర్సిటీ ఆఫ్ దిల్లీకి చెందిన డాక్టర్ అనురాధా చౌధరీ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం చేపట్టింది. పరిశోధనలో భాగంగా, అండమాన్ దీవుల్లోని దాదాపు ఎనిమిది ప్రాంతాల నుంచి 48 ఇసుక, నీటి నమూనాలను సేకరించారు. అక్కడి ఇసుక, రాతి బీచ్‌లు, చిత్తడి నేలలు, మడ అడవుల నుంచి ఈ నమూనాలను సేకరించి పరీక్షించారు. మానవులు తిరగని క్షార స్వభావం కలిగిన నేలలతో పాటు మానవుల తాకిడి ఎక్కువగా ఉండే బీచ్‌ల సేకరించిన ఈ నమూనాలలో సీ.ఆరిస్‌ను వేరుచేసి పరీక్షించారు. క్షార స్వభావ నేలలతో పోలిస్తే మానవులు ఎక్కువగా తిరిగే ప్రదేశంలో కనిపించిన సీ.ఆరిస్.. ఔషధాలకు లొంగనిదని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే, ఈ సూపర్‌బగ్ అండమాన్‌లోనే జీవించి ఉంటుందనే విషయం రుజువు కాలేదని స్పష్టంచేశారు. మానవుల ద్వారా ఈ సూక్ష్మజీవులు (మైక్రోబ్స్) ఎక్కడ నుంచైనా రావొచ్చని, ముఖ్యంగా మానవుల తాకిడి ఎక్కువగా ఉండే బీచ్‌లలో ఇది సాధ్యమని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
లక్షణాలు..?
జ్వరం, తీవ్ర చలి వంటి లక్షణాల కంటే ముందు సూపర్‌బగ్ వల్ల వచ్చే లక్షణాలను అంత తేలికగా గుర్తించలేము. వాటిని తగ్గించేందుకు ఔషధాలు వాడినప్పటికీ అవి తగ్గే అవకాశం తక్కువ. ఒక్కోసారి తీవ్రత ఎక్కువై ప్రాణాలకే ప్రమాదం కావచ్చు. సూపర్‌బగ్‌గా పిలిచే ఈ క్యాండిడ్ ఆరిస్ సూక్ష్మజీవి శరీరంలోకి ప్రవేశించే ముందు కొంతసమయం పాటు చర్మంపై జీవిస్తుంది. ఇది రక్తం ద్వారా శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఇది ప్రమాదకరమైన ‘సెస్పిస్’కు దారితీస్తుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది. ఔషధాలకు లొంగని గుణమున్న ఈ సూక్ష్మజీవులను అదుపుచేయడం కష్టమని అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) కూడా చెబుతోంది. దీంతో ప్రజారోగ్యానికి అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల జాబితాలో 2019లో సీడీసీ చేర్చింది. ఆసుపత్రి వాతావరణంలో ఇది ఎక్కువ కాలం మనుగడ సాధిస్తుందని వెల్లడైనప్పటికీ, సాధారణ వాతావరణంలో ఈ సూపర్‌బగ్‌ను ఇప్పటివరకు గుర్తించలేదు.
మిస్టరీగానే సుపర్బగ్ వ్యాప్తి..
ప్రాణాంతకమైందిగా భావిస్తున్న ఈ సూపర్‌బగ్ ఎలా వ్యాపిస్తోందన్న విషయం మిస్టరీగా మిగిలింది. అయితే, వాతావరణ మార్పుల కారణంగా ఇది వ్యాపిస్తుందని పరిశోధకులు ఇది వరకు అంచనా వేశారు. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఈ ఫంగస్ మానవులకు సోకుతున్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మొట్టమొదటి సారిగా 2009 సంవత్సరంలో ఈ సూపర్‌బగ్‌ను జపాన్‌లోని ఓ రోగిలో గుర్తించారు. బ్రిటన్‌లోనూ ఈ సూక్ష్మజీవి ఆనవాళ్లు బయటపడ్డాయి. అక్కడి ప్రజారోగ్య విభాగం నివేదిక ప్రకారం, 2019 నాటికి బ్రిటన్‌లో దాదాపు 270 మందిలో దీన్ని గుర్తించగా వీరిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలకు సూపర్‌బగ్ కారణమని చెప్పడానికి ఆధారాలు మాత్రం లేవని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఫంగస్ ఎక్కడ నుంచి వస్తోందన్న విషయం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిందని అమెరికాలోని జాన్స్హాప్కిన్స్ బ్లూమ్‌బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన డాక్టర్ ఆర్టురో క్యాసడేవాల్ పేర్కొన్నారు. ఈ సూపర్‌బగ్‌పై తదుపరి పరిశోధనలకు తాజా అధ్యయనం దోహదం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే, కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ, రానున్న రోజుల్లో ఇతర మహమ్మారుల ముప్పుపై ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ సూపర్‌బగ్ ఆనవాళ్లు ఉన్నట్లు ధ్రువీకరించినట్లయితే, వీటిపై మ్యాపింగ్ చేయడం ఇప్పటి నుంచే ప్రారంభించాలని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.