EPFO: ఈపీఎస్‌ ముందస్తు ఉపసంహరణలో మార్పులు

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థలో పదేళ్ల సర్వీసు పూర్తవకుండానే ఉద్యోగుల పింఛను స్కీం(ఈపీఎస్‌)లో జమైన మొత్తాన్ని ఉపసంహరించుకునే వారికి వచ్చే డబ్బులు ఇకపై కొంతమేరకు తగ్గనున్నాయి. ఈపీఎస్‌ ముందస్తు ఉపసంహరణ చెల్లింపుల గణాంక టేబుల్‌ను ఈపీఎఫ్‌వో పూర్తిగా మార్చేయడమే ఇందుకు కారణం.

Updated : 18 Jun 2024 12:22 IST

ఏడాది కాలానికి బదులుగా నెలల వారీగానే లెక్కింపు

ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థలో పదేళ్ల సర్వీసు పూర్తవకుండానే ఉద్యోగుల పింఛను స్కీం(ఈపీఎస్‌)లో జమైన మొత్తాన్ని ఉపసంహరించుకునే వారికి వచ్చే డబ్బులు ఇకపై కొంతమేరకు తగ్గనున్నాయి. ఈపీఎస్‌ ముందస్తు ఉపసంహరణ చెల్లింపుల గణాంక టేబుల్‌ను ఈపీఎఫ్‌వో పూర్తిగా మార్చేయడమే ఇందుకు కారణం. పని చేసిన సర్వీసును ఏడాది లెక్కన పరిగణనలోకి తీసుకోకుండా... ఎన్ని నెలలు పనిచేస్తే అన్ని నెలలకే లెక్కించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈపీఎస్‌ చట్టం, 1995 టేబుల్‌-డీకి కార్మికశాఖ సవరణ చేసింది. ఈపీఎఫ్‌వో నిబంధనల ప్రకారం... ఉద్యోగి, కార్మికులు ఏదేని సంస్థలో పనిచేస్తూ కనీసం పదేళ్ల ఈపీఎస్‌ సర్వీసు పూర్తి చేస్తేనే అతను/ఆమెకు 58 ఏళ్లు వచ్చాక నెలవారీ పింఛను పొందుతారు. తొమ్మిదేళ్ల ఆరు నెలల సర్వీసు పూర్తి చేసినా పదేళ్లుగానే పరిగణిస్తారు. అంతకు తక్కువుంటే పింఛను రాదు. పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఈపీఎస్‌ నిల్వలను ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి ఇవ్వరు. కనీస సర్వీసు లేనివారికి మాత్రమే డబ్బులను ఇచ్చేస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు పదేళ్ల సర్వీసుకంటే ముందే ఈపీఎస్‌ మొత్తాన్ని ఉపసంహరిస్తున్నారు. స్థానికులైన కొందరు యువతీ, యువకులు... రెండు, మూడేళ్లకో ఉద్యోగం మారుతూ పూర్తి మొత్తాన్ని వెనక్కి తీసుకుంటున్నారు. అయితే... బదిలీ, ఉద్యోగం మానేసిన కారణాలతో డబ్బులను వెనక్కి తీసుకోవద్దని, మరో సంస్థకు ఆ సర్వీసును పూర్తిగా బదిలీ చేసుకుంటే పింఛను అర్హత పొందడంతోపాటు ఎక్కువ పింఛను వస్తుందని ఈపీఎఫ్‌వో అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ కొందరు ఈపీఎఫ్‌తోపాటు ఈపీఎస్‌ నిధులనూ తీసేసుకుని ఖాతాను మూసివేస్తున్నారు. ఇలాంటి వారికి టేబుల్‌-డీ ప్రకారం మొత్తాన్ని లెక్కించి ఇస్తారు. 

ఈపీఎస్‌ను ఎలా లెక్కిస్తారంటే... 

ప్రతి ఉద్యోగి వేతనం నుంచి 12% ఈపీఎఫ్‌ ఖాతాకు వెళ్తుంది. అంతేమొత్తంలో యజమాని చెల్లించే 12% వాటాలో 8.33% ఈపీఎస్‌లోకి, మిగతా 3.67% ఉద్యోగి ఈపీఎఫ్‌ ఖాతాలోకి వెళ్తుంది. 2014 నుంచి ఈపీఎఫ్‌వో గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేలకు పెంచారు. దాని ప్రకారం యజమాని చెల్లించే 12% వాటా (రూ.1,800)లో 8.33% అంటే రూ.1,250 ఈపీఎస్‌కు వెళ్తుంది. ఎవరైనా ఉద్యోగి పదేళ్ల సర్వీసుకు ముందే తన ఉద్యోగానికి రాజీనామా లేదంటే పదవీ విరమణ చేయడం ద్వారా ఈపీఎస్‌ను వెనక్కి తీసుకోవాలని అనుకుంటే... అతని సర్వీసును పరిగణనలోకి తీసుకుని ఎంత చెల్లించాలో లెక్కించేవారు. ఉదాహరణకు... ఉద్యోగి మూలవేతనం + డీఏ కలిపి రూ.15 వేలుంది. అతను ఆరేళ్ల ఏడు నెలలపాటు పని చేశారు. అప్పుడు గత నిబంధన ప్రకారం ఆరేళ్ల ఏడు నెలలను మొత్తం ఏడేళ్లుగా పరిగణించి ఈపీఎస్‌ వాటా నగదును చెల్లించేవారు. రాజీనామా/విరమణ చేసినప్పుడు రూ.15 వేలు ఉన్నందున... టేబుల్‌-డీ ప్రకారం ఏడేళ్ల కాలానికి 7.13 నిష్పత్తి లెక్కన చెల్లించేవారు. అంటే రూ.15,000 X 7.13 చొప్పున రూ.1,06,950 లభిస్తాయి. తాజా నిబంధనల ప్రకారం ఆరేళ్ల ఏడు నెలలు అంటే.. 79 నెలలు అవుతుంది. 79 నెలల కాలానికి నిష్పత్తి 6.69 అవుతుంది. అంటే రూ.15000 X 6.69 లెక్కన రూ.1,00,350 అందుతాయి. తాజా నెలలవారీ నిబంధన ప్రకారం ముందస్తు ఉపసంహరణపై వచ్చే మొత్తం తగ్గుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని