china: మాతో ఢీకొంటే తల పగులుతుంది!

చైనాను వేధించే రోజులు శాశ్వతంగా తొలగిపోయాయని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. తియనాన్మెన్‌ స్క్వేర్‌లో చైనా కమ్యూనిస్టు పార్టీ శతవార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Updated : 22 Nov 2022 21:01 IST

 అమెరికానుద్దేశించి హెచ్చరించిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాను వేధించే రోజులు శాశ్వతంగా తొలగిపోయాయని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. తియనాన్మెన్‌ స్క్వేర్‌లో చైనా కమ్యూనిస్టు పార్టీ శతవార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మావోను తలపించేలా వస్త్రధారణ చేసిన షీ జిన్‌పింగ్‌.. సభకు హాజరైన 70 వేల మందిని ఉద్దేశించి ప్రసంగించారు. తైవాన్‌ విలీనానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. ‘‘తైవాన్‌ సమస్య  పరిష్కారానికి, చైనా జాతీయ ప్రయోజనాలు, ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు దేశ ప్రజలకు ఉన్న సంకల్ప, సామర్థ్యాలను ఎవరూ తక్కువగా అంచనా వేయవద్దు. సోషలిజం మాత్రమే చైనాను కాపాడగలదు. సోషలిజానికి చైనా లక్షణాలు జోడించి దేశాన్నిఅభివృద్ధి చేయవచ్చు. చైనాను లొంగదీసుకోవడం, బెదిరించడం, అణిచివేయడం లాంటి ప్రయత్నాలను ఏమాత్రం సహించం. ఎవరైనా ఇటువంటి దుస్సాహసం చేయాలనుకుంటే, 140 కోట్ల ప్రజలు సృష్టించిన ‘ది గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ స్టీల్‌’ను ఢీకొని వారి తల పగులుతుంది. హాంకాంగ్‌, మకావ్‌లో అత్యున్నత స్థాయిలో స్వయం ప్రతిపత్తి కొనసాగుతోంది. వారు ‘ఒక దేశం రెండు వ్యవస్థల’ విధానాన్ని సమర్థంగా అమలు చేస్తున్నారు’’  అని పేర్కొన్నారు. ఆయన ప్రసంగం దాదాపు గంటసేపు సాగింది. ఈ సందర్భంగా ఆధునిక చైనా అభివృద్ధిలో కమ్యూనిస్టు పార్టీ పాత్రను ఆయన పొగడ్తలతో ముంచెత్తారు. పార్టీని ప్రజలకు దూరం చేయాలని భావించినవారు ఓడిపోయారన్నారు. 

ఈ కార్యక్రమం సందర్భంగా చైనా ఫైటర్‌ జెట్‌ విన్యాసాలు, శతఘ్నులతో వందన స్వీకారం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు మాస్కులు ధరించలేదు. ఈ ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని కొన్నాళ్ల నుంచి చైనా మీడియాలో సెన్సార్‌ చేసిన కమ్యూనిస్టు పార్టీ చరిత్రను ప్రసారం చేస్తున్నారు. ది బర్డ్స్‌ నెస్ట్‌ స్టేడియంలో సోమవారం ‘ది గ్రేట్‌ జర్నీ’ పేరిట ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో చైనా చరిత్రను చెప్పినా.. సాంస్కృతిక విప్లవం, తియనాన్మెన్‌ స్క్వేర్‌ ఘటన, హాంగ్‌కాంగ్‌ నిరసనలను విస్మరించారు. దీంతోపాటు చాలా ట్రావెల్‌ కంపెనీలు రెడ్‌ టూరిజం పేరిట 100 ప్రదేశాలకు ట్రిప్‌లను అందుబాటులోకి తెచ్చాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని