Siddaramaiah: అప్పులు తెచ్చుకొని.. ఆడంబరంగా పెళ్లిళ్లు చేసుకోవద్దు: కర్ణాటక సీఎం

హంగు ఆర్భాటాలతో పెళ్లిళ్లు జరిపించడం మంచి పద్ధతి కాదని కర్ణాటక (Karnataka) సీఎం సిద్ధ రామయ్య (Siddaramaiah) అన్నారు. గొప్పలకు పోయి కొందరు పేద, మధ్య తరగతి ప్రజలు అప్పుల్లో కూరుకుపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. 

Published : 27 Sep 2023 17:45 IST

బెంగళూరు : ప్రజలు అప్పులు చేసి మరీ ఆడంబరంగా పెళ్లిళ్లు చేసుకోవడం మానుకోవాలని కర్ణాటక (Karnataka) సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) అన్నారు. చామరాజనగర్‌లోని ఎం.ఎం. హిల్స్‌ దేవాలయంలో నిర్వహించిన సామూహిక వివాహాల వేడుకకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రజలు బయట రుణాలు తీసుకొచ్చి ఆర్భాటంగా పెళ్లిళ్లు చేయడం ఎంత మాత్రం మంచి పద్ధతి కాదని చెప్పారు. కొందరు వ్యవసాయ రుణాలు తీసుకొని సమాజంలో పేరు కోసం ఘనంగా వివాహాలు చేస్తున్నారన్నారు. పేద, శ్రామిక వర్గాల ప్రజలు ఆడంబరాల కోసం చేసిన అప్పులను తీర్చడానికి జీవితాంతం కష్టపడాల్సి వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే సమాజం నిరాడంబరంగా జరిగే సామూహిక వివాహాలను ప్రోత్సహించాలని సీఎం పిలుపునిచ్చారు. 

కర్ణాటకలో మరోసారి రాజుకున్న కావేరి నదీజలాల చిచ్చు

ఈ సందర్భంగా సిద్ధరామయ్య ఎం.ఎం. హిల్స్‌ దేవాలయం అభివృద్ధిని ప్రస్తావించారు. మాల మహదీశ్వర హిల్స్‌గా పేరొందిన ఈ ఆలయం ప్రస్తుతం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోందని చెప్పారు. తొలిసారి ముఖ్యమంత్రి అయిన తరువాత ఆలయ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేసిన విషయాన్ని సిద్ధ రామయ్య గుర్తు చేశారు. అప్పట్లో తీసుకున్న చర్యల ఫలితంగానే ప్రస్తుతం ఆలయ ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. కర్ణాటక ప్రభుత్వం శక్తి పథకం ద్వారా ఉచిత రవాణా ఏర్పాటు చేసినందున ఈ ఆలయాన్ని సందర్శించే మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. వచ్చే ఐదేళ్లలో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి రూపురేఖలను మారుస్తామని తెలిపారు. 

ఇదిలా ఉండగా.. ఎం.ఎం.హిల్స్‌లోని భవన్‌ను తపోభవనంగా మారుస్తున్నట్లు ప్రభుత్వం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సుత్తూరు మఠానికి చెందిన శ్రీ శివరాత్రి దేశికేంద్ర స్వామీజీ సూచన మేరకు ఆ విధంగా పేరు మార్చారు. మహదేశ్వరుడు తపస్సు చేసిన ప్రదేశం కాబట్టే దానికి తపోభవనం అని పేరు మార్చినట్లు తెలిసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని