Nepal Plane Tragedy: విషాదంగా మారిన ‘విడాకుల జంట విహారయాత్ర’

నేపాల్‌లో కుప్పకూలిన తారా ఎయిర్‌లైన్స్‌ విమానంలో ప్రాణాలు కోల్పోయిన దంపతులు గతంలోనే విడాకులు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Updated : 31 May 2022 17:31 IST

నేపాల్‌ విమాన ప్రమాదంలో భారత కుటుంబం దుర్మరణం

ముంబయి: నేపాల్‌లో కుప్పకూలిన తారా ఎయిర్‌లైన్స్‌ విమానంలో మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు భారతీయులు కూడా చనిపోయారు. అయితే, ఇందులో మరణించిన భారతీయ దంపతులు గతంలోనే విడాకులు తీసుకున్నట్లు తెలిసింది. కోర్టు ఆదేశాల ప్రకారం, ప్రతిఏటా పదిరోజులు కలుసుకోవాలనే నిబంధనలో భాగంగా నేపాల్‌లో విహారయాత్రకు వెళ్లిన జంటకు విషాదమే మిగిలింది. విమాన ప్రమాదం రూపంలో వచ్చిన మృత్యువు.. విడిపోయిన జంటతోపాటు వారి ఇద్దరి పిల్లల్నీ కానరాని లోకాలకు తీసుకెళ్లింది.

తారా ఎయిర్‌లైన్స్‌ విమానంలో ప్రయాణించిన అశోక్‌ త్రిపాఠి (54) ఒడిశాలో ఓ కంపెనీని నిర్వహిస్తుండగా.. వైభవి భండేకర్‌ త్రిపాఠి (51) ముంబయిలోని బీకేసీ సంస్థలో పనిచేస్తున్నారు. వైభవి తన ఇద్దరు పిల్లలు ధనుష్‌ (22), కుమార్తె రితిక (15)తో కలిసి ఠాణెలోని బాల్కుం ప్రాంతంలో నివాసముంటున్నారు. అయితే, అశోక్‌, వైభవిలు గతంలోనే విడాకులు తీసుకున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం.. ఏడాదిలో ఓ పదిరోజులు ఆ కుటుంబం కలిసి ఉండాలనే నిబంధన విధించింది. ఈ క్రమంలో పిల్లలతో కలిసి ఈ ఏడాది విహారయాత్రకు వెళ్ళాలని నిర్ణయించుకున్న విడిపోయిన దంపతులు.. నేపాల్‌ పర్యటనకు బయలుదేరారు. నేపాల్‌లోని పర్యాటక ప్రదేశమైన పొఖారా నుంచి బయల్దేరిన వీరి విమానం ఇరవై నిమిషాల్లో గమ్యాన్ని చేరాల్సి ఉందనేలోగా ప్రమాదానికి గురయ్యింది. ఆ ఘటనలో త్రిపాఠి కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం ఆ ఇంట్లో ఎనభైఏళ్ల వృద్ధురాలు (వైభవి తల్లి) మాత్రమే మిగిలిపోయినట్లు ఠాణె పోలీసులు వెల్లడించారు. అయితే, ఆమె కూడా ఆక్సిజన్‌ సహాయంతో కాలం గడుపుతున్నందున.. త్రిపాఠి కుటుంబం మరణించిన విషయాన్ని ఆమెకు ఎవ్వరూ చెప్పవద్దని వైభవి సోదరి అభ్యర్థించారు. ఊహించని ఘటనలో ఆ ప్రాంతం మొత్తం విషాద ఛాయలు నెలకొన్నాయి.

ఇదిలాఉంటే, తారా ఎయిర్‌లైన్స్‌ విమాన ప్రమాదంతో మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోగా సోమవారం వరకు 21 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో మృతదేహం కోసం మంగళవారం నాడు గాలింపు చేపట్టిన  రిస్క్యూ సిబ్బందికి చివరి దేహం లభ్యమైంది. అయితే, ఇప్పటివరకు పది మృతదేహాలను మాత్రమే కాఠ్‌మాండూలోని బేస్‌ క్యాంపునకు తరలించగా మరో 12 దేహాలు ప్రమాద ఘటనా స్థలంలోనే ఉన్నట్లు నేపాల్‌ ఆర్మీ అధికారులు వెల్లడించారు. ప్రతికూల వాతావరణం కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం కలుగుతోందన్నారు. ఇక ప్రమాదానికి గురైన విమానంలోని కీలకమైన బ్లాక్‌బాక్స్‌ కూడా లభ్యమైనట్లు అధికారులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని