Covishield: పేరు చిక్కు వీడుతోంది..!

కరోనా టీకా కొవిషీల్డ్ తీసుకున్న భారతీయులకు ఐరోపా దేశాల్లో పర్యటించే విషయంలో ఊరట లభించింది. ఆ టీకా రెండుడోసులు స్వీకరించిన  భారతీయులు ప్రయాణించేందుకు స్విట్జర్లాండ్, ఏడు ఐరోపా సంఘం(ఈయూ) దేశాలు తాజాగా అనుమతినిచ్చాయి. 

Updated : 21 Dec 2022 16:41 IST

‘గ్రీన్‌పాస్‌’ పథకంలో కొవిషీల్డ్‌ను చేర్చిన 7ఈయూ దేశాలు

దిల్లీ: కరోనా టీకా కొవిషీల్డ్ తీసుకున్న భారతీయులకు ఐరోపా దేశాల్లో పర్యటించే విషయంలో ఊరట లభించింది. ఆ టీకా రెండుడోసులు స్వీకరించిన భారతీయులు ప్రయాణించేందుకు స్విట్జర్లాండ్, ఏడు ఐరోపా సమాఖ్య(ఈయూ) దేశాలు తాజాగా అనుమతినిచ్చాయి. గురువారం నుంచి ఐరోపా సంఘం దేశాల్లో ‘గ్రీన్ పాస్’ పథకం అమల్లోకి వస్తోంది. దీని ప్రకారం ఐరోపా ఔషధ సంస్థ(ఈఎంఏ) ధ్రువీకరించిన టీకాలు వేసుకుంటే, ఈయూ దేశాల్లో ప్రయాణ ఆంక్షలు ఉండవు. వాక్సేవ్రియా పేరుతో విక్రయిస్తోన్న ఆస్ట్రాజెనికా టీకాను అనుమతించిన ఈఎంఏ.. కొవిషీల్డ్ పేరుతో సీరం సంస్థ తయారుచేస్తోన్న అదే టీకాను మాత్రం తన జాబితాలో చేర్చలేదు. దాంతో కొవిషీల్డ్ టీకా తీసుకున్నవారికి ఈయూ దేశాల్లో పర్యటించే విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి.

ఈ విషయాన్ని సీరం సంస్థ సీఈఓ అదర్‌ పూనావాలా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో భారత్ ప్రభుత్వం కూడా ఈయూకి విజ్ఞప్తి చేసింది. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్  టీకాలు వేసుకున్న భారతీయులను ‘గ్రీన్‌పాస్‌’ పథకం కింద ఐరోపా దేశాలకు అనుమతించాలని కోరింది. దీనిపై సానుకూలంగా స్పందిస్తే.. తాము కూడా ఈయూ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఎలాంటి ఆంక్షలు విధించబోమని పేర్కొంది. ఈ క్రమంలో ఆస్ట్రియా, జర్మనీ, స్లొవేనియా, గ్రీస్, ఐస్‌లాండ్, ఐర్లాండ్, స్పెయిన్ వంటి ఏడు ఈయూ దేశాలతో పాటు స్విట్జర్లాండ్‌ ఈ టీకాను తమ జాబితాలోకి చేర్చింది.  కొద్దిరోజుల్లో కొవిషీల్డ్ టీకాను ఈఎంఏ ఆమోదిస్తుందని బుధవారం అదర్ పూనావాలా విశ్వాసం వ్యక్తం చేశారు.    

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని