Euthanasia: కారుణ్య మరణం కోసం స్విట్జర్లాండ్‌కు..? అడ్డుకోవాలని కోర్టును ఆశ్రయించిన మిత్రురాలు

దీర్ఘకాల వ్యాధితో బాధపడుతోన్న ఓ వ్యక్తి కారుణ్య మరణానికి (Euthanasia) సిద్ధమైనట్లు తెలుస్తోంది. భారత్‌లో అందుకు అనుమతి లేకపోవడంతో స్విట్జర్లాండ్‌ వెళ్లి మరణించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.

Published : 12 Aug 2022 19:22 IST

దిల్లీ: దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతోన్న ఓ వ్యక్తి కారుణ్య మరణానికి (Euthanasia) సిద్ధమైనట్లు తెలుస్తోంది. భారత్‌లో అందుకు అనుమతి లేకపోవడంతో స్విట్జర్లాండ్‌ (Switzerland) వెళ్లి మరణించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో చికిత్స పేరు చెప్పి యూరప్‌ వీసా కూడా పొందాడు. అయితే, ఆయన వెళ్లేది చికిత్స కోసం కాదని.. కారుణ్య మరణానికేనంటూ బాధితుడి మిత్రురాలు పేర్కొంటున్నారు. దీంతో ఆయనను స్విట్జర్లాండ్‌ వెళ్లకుండా అడ్డుకోవాలని కోరుతూ దిల్లీ హై కోర్టును (Delhi HC) ఆశ్రయించారు.

ఏమిటీ వ్యాధి..?

మైయాల్జిక్ ఎన్సెఫలోమైయోలిటీస్ అనేది దీర్ఘకాలిక అలసట వ్యాధి (Chronic Fatigue Syndrome). వ్యాధి బయటపడిన కొన్ని నెలల్లోనే శారీరకంగా, మానసికంగా తీవ్ర సమస్యలు ఎదురవుతాయి. దీంతో వ్యక్తి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. ఈ వ్యాధికి చికిత్స లేదు. నోయిడాకు చెందిన ఓ 49ఏళ్ల వ్యక్తి.. 2014 నుంచి ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నాడు. కొన్నిరోజుల క్రితం వరకు ఎయిమ్స్‌లో చికిత్స తీసుకున్నాడు. కొవిడ్‌ కారణంగా దాతల సహాయం నిలిచిపోవడంతో చికిత్సకు ఆటంకం కలిగింది. దీంతో ఇటీవల ఆరోగ్యపరిస్థితి మరింత క్షీణించడంతో ప్రస్తుతం బెడ్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో కారుణ్య మరణానికి (Euthanasia) సిద్ధమైన బాధితుడు.. స్విట్జర్లాండ్‌ వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాడు.

కారుణ్య మరణానికే..!

తాజాగా బాధితుడు స్విట్జర్లాండ్‌కు (Switzerland) వెళ్లేందుకు సిద్ధం కాగా.. ఆయన వెళ్లేది చికిత్స కోసం కాదని, కారుణ్య మరణం (Assistant Suicide) చెందడానికంటూ బెంగళూరుకు చెందిన ఆయన మిత్రురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దిల్లీ కోర్టును ఆశ్రయించిన ఆమె.. భారత్‌తోపాటు యూరప్‌ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి తన మిత్రుడు వీసా పొందాడంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ‘ఇమ్మిగ్రేషన్‌ క్లియరెన్స్‌’ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం భారత్‌లో చికిత్స అందించేందుకు అవసరమైన ఆర్థిక ఇబ్బందులేమీ లేవని, కేవలం కారుణ్య మరణం కోసమే ఆయన యూరప్‌ వెళ్లాలని నిశ్చయించుకున్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇందుకోసం స్విట్జర్లాండ్‌కు చెందిన డిగ్నిటాస్‌ సంస్థ సహకారంతో బాధితుడు కారుణ్య మరణానికి ప్రణాళిక వేస్తున్నట్లు బాధితుడి మిత్రురాలు పిటిషన్‌లో వెల్లడించారు.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేలా కేంద్రాన్ని ఆదేశించాలని దిల్లీ హైకోర్టును అభ్యర్థించారు. ఇందులో భాగంగా షెంజెన్‌ వీసా (Schengen visa)తో ఇప్పటికే ఓసారి యూరప్‌ వెళ్లివచ్చిన బాధితుడు, అక్కడి అధికారులతోపాటు ఓ సంస్థతో సంప్రదింపులు జరిపారన్నారు. ఒకవేళ ఆయన యూరప్‌ వెళ్లి కారుణ్య మరణం చెందితే వృద్ధ తల్లిదండ్రులతో పాటు తామెంతో మనోవేదనకు గురవుతామంటూ పిటిషన్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

స్విట్జర్లాండ్‌లో అనుమతి ఉందా..?

కారుణ్య మరణానికి ప్రపంచంలోని అనేక దేశాలు అనుమతి ఇవ్వడం లేదు. ఇందుకు భారత చట్టాలు కూడా అనుమతించవు. అయితే, చికిత్స లేని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ల కారుణ్య మరణానికి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం అనుమతిస్తోంది. ఈ దేశంలో అసిస్టెంట్‌ సూసైడ్‌ (Assistant Suicide)పేరుతో పిలిచే కారుణ్య మరణానికి.. న్యాయస్థానం, ప్రభుత్వం అనుమతితోపాటు వైద్యుల సలహా మేరకు అంగీకరిస్తారు. ఇందుకోసం నొప్పిలేకుండా నిమిషాల్లోనే మరణాన్ని ప్రసాదించే సూసైడ్‌ మెషిన్‌ (Sarco Pod) కూడా ఈమధ్యే అక్కడ అందుబాటులోకి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని