Maharashtra: ఏడాదిన్నరగా గవర్నర్‌ నిద్రపోతున్నారా..? కాంగ్రెస్‌

మహారాష్ట్ర అసెంబ్లీ నూతన స్పీకర్‌గా రాహుల్‌ నర్వేకర్‌ ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బాలాసాహెబ్‌ థోరట్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు.

Published : 03 Jul 2022 17:38 IST

మహారాష్ట్ర గవర్నర్‌ కోశ్యారీ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్‌

ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ నూతన స్పీకర్‌గా రాహుల్‌ నర్వేకర్‌ ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బాలాసాహెబ్‌ థోరట్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. గత కొంత కాలంగా స్పీకర్‌ నియామాకం చేపట్టాలని తాము డిమాండ్‌ చేస్తున్నప్పటికీ ఏడాదిన్నరగా గవర్నర్‌ నిద్రపోయినట్లు కనిపిస్తోందంటూ మండిపడ్డారు. స్పీకర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ మాట్లాడిన థోరట్‌.. చాలా నెలలుగా ఖాళీగా ఉన్న స్పీకర్‌ ఎన్నికను చేపట్టకపోవడంలో గవర్నర్‌ తీరుపై మండిపడ్డారు.

మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న కాంగ్రెస్‌ నేత నానా పటోల్‌ గతేడాది ఫిబ్రవరిలో రాజీనామా చేశారు. అప్పటినుంచి ఆ పోస్టు ఖాళీగానే ఉంది. స్పీకర్‌ ఎన్నికను చేపట్టాలని మహావికాస్‌ అఘాడీ కూటమి విజ్ఞప్తి చేసినా గవర్నర్‌ మాత్రం అందుకు అంగీకరించలేదు. ముఖ్యంగా వాయిస్‌ ఓట్‌ ద్వారా స్పీకర్‌ ఎన్నికను చేపట్టాలని అంతకుముందున్న నిబంధనలను ఎంవీఏ ప్రభుత్వం సవరించింది. ఇది రాజ్యాంగవిరుద్ధంగా ఉందన్న గవర్నర్‌.. దీనిపై న్యాయసలహా తీసుకుంటానని పేర్కొన్నారు. ఇలా ఏడాదిన్నర గడిచినప్పటికీ గవర్నర్‌ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. చివరకు ప్రభుత్వం మారడం.. ఏక్‌నాథ్‌ శిందే సీఎంగా బాధ్యతలు చేపట్టడం చకచకా జరిగిపోయాయి. ఈ సమయంలో ముఖ్యమంత్రి బలనిరూపణకు గవర్నర్‌ ఆదేశించడంతో స్పీకర్‌ ఎన్నిక అనివార్యమైంది.

కసబ్‌కే లేని భద్రత రెబల్‌ నేతలకు..

స్పీకర్‌ ఎన్నిక సందర్భంగా అసెంబ్లీకి హాజరైన శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలకు భారీ భద్రత కల్పించడంపై శివసేన నేత ఆదిత్యఠాక్రే మండిపడ్డారు. ఈ స్థాయిలో భద్రత కనీసం కసబ్‌కు కూడా లేదని గుర్తుచేశారు. ముంబయిలో ఈ స్థాయి భద్రత ఎన్నడూ చూడలేదని.. ఆ నేతలు ఎందుకు భయపడుతున్నారని అన్నారు. రెబల్‌ ఎమ్మెల్యేల్లో ఎవరైనా పారిపోతున్నారా? భయం ఎందుకంటూ ఏక్‌నాథ్‌ ప్రభుత్వాన్ని ఆదిత్య ఠాక్రే ప్రశ్నించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏక్‌నాథ్‌ శిందే.. అసెంబ్లీలో సోమవారం బలనిరూపణ ఎదుర్కోనున్నారు. ఈ నేపథ్యంలోనే రెబల్‌ ఎమ్మెల్యేలు బస చేస్తోన్న హోటల్‌ నుంచి అసెంబ్లీ వరకు భద్రత కట్టుదిట్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని