COVID-19: కరోనా సోకితే సంతానోత్పత్తిపై ప్రభావం.. తాజా పరిశోధనలో వెల్లడి!

కరోనా​ సోకిన పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గుతుందా? వైరస్‌ స్వల్ప లక్షణాలతో అనారోగ్యానికి గురైన వారిలోనూ సంతానోత్పత్తి ప్రోటీన్లు దెబ్బతింటాయా?......

Published : 11 Apr 2022 22:47 IST

దిల్లీ: కరోనా​ సోకిన పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గుతుందా? వైరస్‌ స్వల్ప లక్షణాలతో అనారోగ్యానికి గురైన వారిలోనూ సంతానోత్పత్తి ప్రోటీన్లు దెబ్బతింటాయా? అంటే అవుననే అంటోంది తాజా అధ్యయనం. కొవిడ్​ సోకిన పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గుతుందని ఐఐటీ బాంబే చేసిన ఓ అధ్యయనంలో తేలింది. వైరస్‌ సోకి స్వల్ప లక్షణాలు బయటపడిన వారిలోనూ సంతానోత్పత్తికి సంబంధించిన ప్రోటీన్లు దెబ్బతింటాయని అధ్యయనం తెలిపింది. ఐఐటీ బాంబేతో కలిసి జస్లోక్​ హాస్పిటల్, రీసెర్చ్​ సెంటర్​ పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. పురుషుల వీర్యకణాలపై చేసిన ఈ పరిశోధనను.. ఏసీఎస్​ ఒమెగా జర్నల్​ గతవారం ప్రచురించింది.

కొవిడ్​కు కారణమైన సార్స్-2 వైరస్​ ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని, దాంతో పాటు ఇతర వ్యవస్థలను దెబ్బతీస్తుందని పరిశోధకులు తెలిపారు. 10 మంది ఆరోగ్యవంతమైన పురుషుల వీర్యంతో పాటు 17 మంది కొవిడ్​ బారిన పడి కోలుకున్న వారి వీర్య నమూనాలను విశ్లేషించినట్లు వెల్లడించారు. ఆరోగ్యవంతమైన వ్యక్తులతో పోలిస్తే.. కరోనా సోకిన వారిలో వీర్య కణాలు గణనీయంగా తగ్గినట్లు అధ్యయనంలో తేలింది. సంతానోత్పత్తికి సంబంధించిన రెండు ప్రోటీన్లు సెమెనోజెలిన్​1, ప్రోసాపోసిన్​ కోలుకున్న వారిలో తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు వివరించారు. అయితే, ఈ అంశాన్ని నిర్ధరించేందుకు మరిన్ని అధ్యయనాలు అవసరమని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని