EVMs: ఈవీఎంలు ‘బ్లాక్‌ బాక్స్‌’లాంటివి.. మస్క్‌ ట్వీట్‌ వేళ రాహుల్‌ కీలక వ్యాఖ్యలు

భారత్‌లోని ఈవీఎంలు ‘బ్లాక్‌ బాక్స్‌’లాంటివని, వాటిని పరిశీలించడానికి ఎవరికీ అనుమతి ఉండదని రాహుల్‌ గాంధీ విమర్శలు చేశారు.

Published : 17 Jun 2024 00:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హ్యాకింగ్‌ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో పోలింగ్‌ ప్రక్రియలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (EVMs)ను తొలగించాలంటూ టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) చేసిన ట్వీట్‌ చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అమెరికాతో పోలిస్తే భారత్‌లోని ఈవీఎంలను ఏ నెట్‌వర్క్‌ లేదా మీడియాతో కనెక్ట్‌ అవ్వని విధంగా రూపొందించారని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఆయన ట్వీట్‌కు ఇప్పటికే బదులిచ్చారు. ఈ పరిణామాల నడుమ ఓటింగ్‌ యంత్రాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌లు కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘భారత్‌లోని ఈవీఎంలు ‘బ్లాక్‌ బాక్స్‌’లాంటివి. వాటిని పరిశీలించడానికి ఎవరికీ అనుమతి ఉండదు. దీంతో దేశ ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై తీవ్రమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత సంస్థల్లో జవాబుదారీతనం లోపించినప్పుడు.. ప్రజాస్వామ్యం మిథ్యగా మారి, మోసాలు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది’’ అని రాహుల్‌ గాంధీ ‘ఎక్స్‌’ వేదికగా విమర్శలు చేశారు. ‘‘టెక్నాలజీ అనేది సమస్యల పరిష్కారానికి ఉద్దేశించింది. ఒకవేళ అదే సమస్యలకు కారణమైతే దాన్ని పక్కన పెట్టాలి. ప్రపంచవ్యాప్తంగా అనేక ఎన్నికల్లో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రఖ్యాత సాంకేతిక నిపుణులు వాటి ట్యాంపరింగ్‌ ముప్పు గురించి బహిరంగంగా చెబుతున్నారు. మన దేశంలో మాత్రం వాటినే ఉపయోగించాలని పట్టుబట్టడం వెనుక కారణమేంటో భాజపా స్పష్టం చేయాలి’’ అని అఖిలేశ్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. రానున్న అన్ని ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని ఉద్ఘాటించారు.

అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు : ఎలాన్ మస్క్‌

అమెరికా నియంత్రణలోని ప్యూర్టో రికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన మస్క్‌.. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించడం ద్వారా హ్యాకింగ్‌ను నివారించొచ్చని సూచించారు. అయితే.. ఇంటర్నెట్‌కు అనుసంధానించేలా తయారు చేసిన ఈవీఎంలను వినియోగించే అమెరికా లేదా ఇతర దేశాల్లో మస్క్‌ చెప్పిన విషయాన్ని అన్వయించుకోవచ్చని రాజీవ్‌ చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. భారత ఈవీఎంలకు బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్‌లతో కనెక్టివిటీ ఉండదని, వీటిని రీప్రోగ్రామ్ చేయడం కూడా కుదరదని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు