drugs: ఎయిరిండియా మాజీపైలట్‌ కన్నుసన్నల్లో డ్రగ్‌ రాకెట్‌..!

ముంబయి, గుజరాత్‌లో పట్టుబడిన రూ.100 కోట్లకుపైగా  విలువైన డ్రగ్స్‌ వెనుక ఎయిరిండియా మాజీ పైలట్‌ హస్తం ఉన్నట్లు ఎన్‌సీబీ అధికారులు గుర్తించారు.

Published : 07 Oct 2022 12:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ముంబయి, గుజరాత్‌లో పట్టుబడిన రూ.100 కోట్లకుపైగా విలువైన డ్రగ్స్‌ వెనుక ఎయిరిండియా మాజీ పైలట్‌ హస్తం ఉన్నట్లు ఎన్‌సీబీ (ది నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో) అధికారులు గుర్తించారు. ఇటీవల ఎన్‌సీబీ అధికారులు ముంబయి, గుజరాత్‌లో 60 కేజీల మెఫిడ్రొన్‌(ఎండీ)ను స్వాధీనం చేసుకొన్నారు. దీని విలువ రూ.120 కోట్లకు పైమాటే. ఈ కేసులో కీలక సూత్రధారులుగా సొహైల్‌ గఫ్పార్‌ మహిదా, మిథి పిచైదాస్‌ అనే వ్యక్తులను గుర్తించారు. అమెరికాలో శిక్షణ పొందిన సొహైల్‌ 2016-18 వరకు ఎయిరిండియా పైలట్‌గా పనిచేశాడు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో ఉద్యోగాన్ని వీడాడు. నిందితులను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు అరెస్టు చేశారు.

తొలుత దిల్లీ, ముంబయి ఎన్‌సీబీ అధికారులు కలిసి అక్టోబర్‌ 3న జామ్‌నగర్‌లో సోదాలు జరిపి 10 కిలోల ఎండీని సీజ్‌ చేశారు. జామ్‌నగర్‌లోని నావికాదళ ఇంటెలిజెన్స్‌ విభాగం నుంచి సమాచారం మేరకు ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నలుగురిని అరెస్టు చేశారు. మరోవైపు ముందుగా అందుకొన్న సమాచారం ప్రకారం గురువారం ఎన్‌సీబీ అధికారులు ముంబయిలోని ఓ గోదాముపై దాడి చేసి 50 కేజీల ఎండీను స్వాధీనం చేసుకొన్నారు.

ఈ ముఠా ఇప్పటి వరకు 225 కిలోల ఎండీని మార్కెట్లో విక్రయించి ఉంటుందని అంచనా. గుజరాత్‌లోని వడోదరాలో ఈ ఏడాది ఆగస్టులో 200 కిలోల ఎండీ, ఏప్రిల్‌లో కాండ్లా పోర్టులో 260 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకొన్నారు. గతేడాది సెప్టెంబరులో ఇదే రాష్ట్రంలో రూ.21,000 కోట్లు విలువైన 3,000 కిలోల మాదకద్రవ్యాలను ముంద్రా పోర్టులో స్వాధీనం చేసుకొన్న విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని